పోలింగ్‌కు దూరంగా బీజీకేపాళెం 

BGK Palem Voters Boycotted The Election - Sakshi

ఎన్నికలను బహిష్కరించిన ఓటర్లు

గ్రామానికి శాశ్వత తారు రోడ్డు నిర్మించాలని నిరసన

ఫలించని సబ్‌ కలెక్టర్‌ చర్చలు 

చిట్టమూరు: మండలంలోని బురదగల్లి కొత్తపాళెం ప్రజలు శనివారం జరిగిన తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలను బహిష్కరించారు. కొన్నేళ్లుగా తమ గ్రామానికి శాశ్వత రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, తమకు రోడ్డు వేసే విషయంలో కచ్చితమైన హామీ ఇస్తే కానీ ఓట్లు వేయమని అధికారులకు తెగేసి చెప్పారు. గత ప్రభుత్వం కూడా తమ రోడ్డు పనులు చేపట్టలేదన్నారు. అదేమంటే తమ గ్రామం పక్షుల రక్షిత కేంద్రం (యూకోసెన్సిటివ్‌ జోన్‌)లో ఉందని అటవీ శాఖ అధికారులు తారు రోడ్డు వేసేందుకు అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారు.

ఉదయం 10 గంటలైనా ఓటర్లు ఎవరూ పోలింగ్‌ కేంద్రానికి రాకపోవడంతో పోలింగ్‌ అధికారులు ఉన్నతాధికాల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గూడూరు సబ్‌ కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ, తహసీల్దార్‌ శ్రీరామకృష్ణ, ఎంపీడీఓ భాస్కర్‌రావు గ్రామానికి చేరుకుని పంచాయతీ సర్పంచ్‌ ఎర్రబోతు మణి, గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ రోడ్డు విషయమై గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రనసాద్‌రావు, కలెక్టర్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారన్నారు. కేంద్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. వచ్చిన వెంటనే తారు రోడ్డు నిర్మాణం కచ్చితంగా చేపడుతారన్నారు. ప్రస్తుతానికి గుంతలుమయంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని సబ్‌ కలెక్టర్‌ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

బీజీకేపాళెం ప్రజలతో చర్చలు జరుపుతున్న సబ్‌ కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ..    

తమకు కచ్చితమైన హామీ కావాలనడంతో ఫోన్‌ ద్వారా కలెక్టర్‌ చక్రధర్‌బాబుతో మాట్లాడించారు. అయినప్పటికీ ససేమిరా అని అనడంతో సబ్‌ కలెక్టర్‌ వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటల సమయంలో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు, వైఎస్సార్‌సీపీ నాయకులు చెన్నారెడ్డి బాబురెడ్డి, వంకా రమణయ్య బురదగల్లి కొత్తపాళెంకు చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే మాటలు కూడా గ్రామస్తులు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు. పంచాయతీలో మొత్తం 1,705 మంది ఓటర్లు ఉన్నారు. బురదగల్లి, కొత్తపాళెం, కుమ్మరిపాళెం, పేరపాటి తిప్ప గ్రామాలకు సంబంధించి అధికారులు మూడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే 278 పోలింగ్‌ బూత్‌లో మాత్రం పంచాయతీ సర్పంచ్‌ ఎర్రబోతు మణి తన ఓటు వేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పంచాయతీలోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు వేచి ఉన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top