ప్రభుత్వాస్పత్రుల్లో పడకల పెంపు

Beds Increase In Government Hospitals - Sakshi

ఇందులో భాగంగా 51 సామాజిక ఆరోగ్య కేంద్రాల ఉన్నతీకరణ

30 పడకలున్న ఆస్పత్రి 50 పడకల ఆస్పత్రిగా మార్పు

ఒక్కో ఆస్పత్రికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు వ్యయం

సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆస్పత్రుల్లో పడకలు లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించడానికి పడకల సంఖ్యను పెంచాలని కసరత్తు చేస్తోంది. 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకలకు పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా మాతాశిశు సంరక్షణకు, నాణ్యమైన వైద్య సేవలకు పెద్దపీట వేయనుంది. 

తొలుత 51 ఆస్పత్రుల్లో పడకలు పెంపు
► ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 51 ఆస్పత్రుల్లో 30 పడకల నుంచి 50 పడకలకు పెంచేందుకు కసరత్తు మొదలైంది. దీనివల్ల 1,020 పడకలు అదనంగా పెరగనున్నాయి
► ఆయా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆస్పత్రి సామర్థ్యానికి మించి ఔట్‌పేషెంట్లు, ఇన్‌పేషెంట్లు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 
► ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రమాణాల మేరకు పడకలను పెంచుతున్నారు. ఒక్కో సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 పడకలు పెంచడానికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వ్యయం అవుతుందని అంచనా
► మొత్తం 51 సీహెచ్‌సీలకు కనిష్టంగా రూ.250 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. పడకలు పెంచడమే కాకుండా ప్రసూతి వార్డులు, ఆపరేషన్‌ థియేటర్, వైద్య పరికరాలు, ఫార్మసీ వంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు.
► పడకల పెంపుతో ఒక్కో సీహెచ్‌సీకి సుమారు 25 మంది వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది అవసరం.
► ఈ 25 మంది జీతాల కోసం ఒక్కో సీహెచ్‌సీకి ప్రతినెలా రూ.4.60 ఖర్చు చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top