అక్టోబర్‌ 30న బద్వేలు ఉపఎన్నిక

Badvelu by-election on October 30 - Sakshi

1 నుంచి నామినేషన్ల స్వీకరణ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక

అమల్లోకి ఎన్నికల నియమావళి

దేశవ్యాప్తంగా మొత్తం 3 లోక్‌సభ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకూ..

కోవిడ్‌ షరతులు వర్తిస్తాయన్న కేంద్ర ఎన్నికల సంఘం

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్‌ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 1న జారీకానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీ. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 2న జరుగుతుంది. షెడ్యూల్‌ వెల్లడి కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందినందున ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితాతో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను విధించింది. 

హుజూరాబాద్‌లో కూడా..
మరోవైపు.. తెలంగాణలోని హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కూడా అదేరోజు ఉపఎన్నిక జరగనుంది. బద్దేలు, హుజూరాబాద్‌తో కలిపి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

కోవిడ్‌ ఆంక్షలు ఇవే..
► నామినేషన్‌ వేసే ముందుగానీ, తరువాతగానీ ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం.
► రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సిబ్బంది, అధికారులను మాత్రమే ఎన్నికల ప్రక్రియలో వినియోగించాలి.
► సభ చుట్టూ వలయాలు, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చును అభ్యర్థులు లేదా పార్టీ భరించాల్సి ఉంటుంది. బారికేడ్లు ఏర్పాటు చేయదగిన బహిరంగ స్థలాలను మాత్రమే సభలకు ఎంపిక చేయాలి.
► స్టార్‌ క్యాంపేయినర్స్‌ సంఖ్యపై కూడా పరిమితి ఉంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు 20 మంది, గుర్తింపు పొందని రిజిస్టర్డ్‌ పార్టీలకు 10 మంది మాత్రమే ఉండాలి.
► రోడ్డు షోలు, బైక్, కార్, సైకిల్‌ ర్యాలీలకు అనుమతిలేదు.
► ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు, వారి ప్రతినిధులు సహా మొత్తం ఐదుగురికి మాత్రమే అనుమతి. 
► ఒక అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి గరిష్టంగా 20 వాహనాలు.. అందులోని సీట్ల సామర్థ్యంలో 50శాతం మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top