AP: నీతి ఆయోగ్‌ మెచ్చిన ఆక్వా టెకీ

'Aqua Exchange' is a company that started as a startup in 2020 - Sakshi

2020లో స్టార్టప్‌గా ప్రస్థానం ప్రారంభించిన ‘ఆక్వా ఎక్స్చేంజ్‌’ సంస్థ 

ఆక్వా రైతులకు టెక్‌ ప్లాట్‌ఫామ్‌ను  పరిచయం చేసిన పవన్‌కృష్ణ 

2,500 మంది రైతులు..  30 వేల ఎకరాల్లో వినియోగం 

రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలందిస్తున్న సంస్థ 

సాక్షి, విశాఖపట్నం: ఆక్వా ఎక్స్చేంజ్‌ పేరుతో సాంకేతికతని పరిచయం చేసి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా ఏకంగా 2,500 మంది రైతుల్ని నడిపిస్తున్నారు విశాఖకు చెందిన పవన్‌కృష్ణ కొసరాజు. అతడి కృషిని నీతి ఆయోగ్‌ గుర్తించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పురోభివృద్ధికి దోహదపడుతున్న 75 స్టార్టప్‌లలో ఆక్వా ఎక్స్చేంజ్‌కు చోటు కల్పించింది.

విశాఖలో చదువుకుని ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ పట్టా, బెర్లిన్‌లో ఎంబీఏ, యూఎస్‌ఏలో ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ పట్టా పుచ్చుకున్న పవన్‌కృష్ణ జర్మనీ, భారతదేశాల్లోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఆ తరువాత ఓ స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూసిన పవన్‌ వారికి సాంకేతికతను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఆక్వా ఎక్స్చేంజ్‌ పేరుతో 2020లో స్టార్టప్‌ను ప్రారంభించారు.

విశాఖలో రిజిస్టర్‌ చేసి విజయవాడలో కార్యాలయం ప్రారంభించారు. కోవిడ్‌ సమయం కావడంతో కాస్తా ఆలస్యంగానే అడుగులు పడ్డాయి. తన బంధువులైన ఒకరిద్దరు రైతులతో మొదలుపెట్టగా.. వారు సత్ఫలితాలు సాధించడంతో క్రమంగా రైతులు ఆక్వా ఎక్స్చేంజ్‌ వైపు ఆకర్షితులయ్యారు.

టెక్‌ పరికరాలు.. లాభాల సిరులు 
ఆక్వా రైతులకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలపైనే పవన్‌ దృష్టి సారించారు. చెరువుల్లో పెంచే రొయ్యలు, చేపలకు ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో సరఫరా చేయడం.. మేతను సమపాళ్లలో అందించడం.. విద్యుత్‌ ఖర్చులు తగ్గించడం.. దిగుబడుల్ని మంచి లాభాలకు కొనుగోలు చేయించడం వంటి నాలుగు అంశాలపై ఆక్వా ఎక్స్చేంజ్‌ పనిచేస్తూ.. రైతుల మన్ననల్ని చూరగొంటోంది. నెక్ట్స్‌ ఆక్వా పేరుతో భిన్నమైన పరికరాలను ఆవిష్కరించారు. వాటికి పేటెంట్లు కూడా దక్కించుకున్నారు.

ఆక్వా ఎక్స్చేంజ్‌ పేరుతో తయారు చేసిన యాప్‌ ద్వారా ఈ పరికరాల్ని ఆయా రైతులే స్వయంగా మోనిటరింగ్‌ చేసుకునేలా వ్యవస్థను రూపొందించారు. అద్భుతమైన ఈ టెక్‌ పరికరాల్ని నెల్లూరు జిల్లా గూడూరు నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ 2500 మంది రైతులు 30 వేల ఎకరాల్లో వినియోగిస్తున్నారు.  

మేతకు ఢోకా లేదు... 
రొయ్యలకు మేత వేసేందుకు చెరువులోకి పడవలో వెళ్లి.. ఒక వైరుని చేత్తో పట్టుకొని మరో చేత్తో మేతని విసురుతారు. అన్నిచోట్లా మేత ఒకేలా అందకపోవడంతో రొయ్యలు, చేపలు సమస్థాయిలో ఎదగవు. ఫలితంగా దిగుబడిలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనిని అధిగమించేందుకు పవన్‌ సంస్థ ఆక్వాబాట్‌ అనే పరికరాన్ని తయారు చేసింది. దీనిని రైతు ఏ ప్రాంతం నుంచైనా స్టార్ట్‌చేసి మేతని అందించవచ్చు.

ఈ మెషిన్‌ చెరువులోని ప్రతి ప్రాంతానికి ఆటోమేటిక్‌గా తిరుగుతూ సమపాళ్లలో మేతని అందిస్తుంటుంది. దీన్ని 6 నెలలకు రైతులకు రూ.20 వేల అద్దెకు అందిస్తున్నారు. సాధారణంగా ఒక చెరువుకు ఒకర్ని నియమించుకుంటే.. ఒక పంటకాలానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుంది. పవన్‌ సంస్థ తయారు చేసిన పరికరాల్ని వినియోగించి దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ రైతులు ఖర్చుల్ని ఆదా చేసుకుంటున్నారు.

ఆక్వాఎక్స్చేంజ్‌లో రిజిస్టర్‌ అవ్వాలంటే నెలకు రూ.150 ఖర్చవుతుంది. వీటిని వినియోగిస్తుండటం వల్ల ప్రతి రైతు విద్యుత్‌ వినియోగంలో రూ.500 నుంచి రూ.600 వరకూ ఆదా చేస్తున్నారు. విజయవాడ శివారు గన్నవరంలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయంలో ప్రస్తుతం 160 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 50 మంది మహిళలుండటం విశేషం.

కరెంట్‌ పోయినా.. చింత లేదు 
ఈ సంస్థ రూపొందించిన పవర్‌ మోన్‌ అనే పరికరాన్ని చెరువు వద్ద ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ సరఫరాను ఆ పరికరమే మోనిటరింగ్‌ చేసుకుంటుంది. కరెంటు పోయినప్పుడు ఏరియేటర్లు ఆగిపోకుండా ఆ పరికరమే జనరేటర్‌ను ఆన్‌ చేస్తుంది. ఆక్వాఎక్స్చేంజ్‌ తయారు చేసిన ఏపీఎఫ్‌సీని పెట్టు­కుంటే..  ఆక్వా చెరువుకు ఎంత లోడ్‌ అవసరమో అంతే విద్యుత్‌వినియోగించేలా చేస్తుంది. తది్వరా విద్యుత్‌ బిల్లు చాలా వరకూ ఆదా అవుతుంది.

25 వేల మంది రైతులకు  చేరువ చేసే దిశగా..
ఆక్వా రైతులకు ఖర్చులు తగ్గించి వారికి భరోసా అందించే దిశగా ప్రారంభించిన స్టార్టప్‌ విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతిక డేటా ఆధారంగా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు  అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం.

కేవలం టెక్‌ పరికరాలు అందించడమే కాదు.. నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు మంచి ధర వచ్చేలా ఎగుమతిదారులకు అనుసంధానం చేసే బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాం. మొత్తంగా 25 వేల మంది రైతులకు లక్ష ఎకరాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. తాజాగా ఒడిశాకు కూడా ఆక్వా ఎక్స్చేంజ్‌ సేవలను విస్తరించాం.   – పవన్‌కృష్ణ కొసరాజు, సీఈవో, ఆక్వా ఎక్స్చేంజ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top