Andhra Pradesh: గెజిట్‌ అమలుపై ముందుకే!

Appointment of Chief Engineers to Krishna and Godavari Boards - Sakshi

కృష్ణా, గోదావరి బోర్డులకు చీఫ్‌ ఇంజనీర్ల నియామకం

నలుగురు అధికారులకు గెజిట్‌ అమలు బాధ్యతలు

బోర్డుల చైర్మన్లతో జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ), గోదావరీ నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)ల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా కేంద్ర జల్‌శక్తి శాఖ మరో అడుగు ముందుకేసింది. నోటిఫికేషన్‌ అమలును అక్టోబరు 14 నుంచి కాకుండా కొంతకాలం వాయిదా వేయాలని ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరిన సంగతి తెలిసిందే. అయితే గెజిట్‌ అమలు సాఫీగా సాగేలా జల్‌శక్తి శాఖ ఆయా బోర్డులకు చీఫ్‌ ఇంజనీర్ల స్థాయి ఉన్నతాధికారులను నియమించింది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి విస్తృతమైన నేపథ్యంలో మానవ వనరులు బలోపేతంతో పాటు బోర్డులు మెరుగైన రీతిలో పనిచేసేలా సెంట్రల్‌ వాటర్‌ ఇంజనీరింగ్‌ గ్రూప్‌ ‘ఏ’ సర్వీసుకు చెందిన సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ అధికారులు నలుగురిని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.

సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయం చీఫ్‌ ఇంజనీర్‌ డాక్టర్‌ ఎం.కె.సిన్హా, సీడబ్ల్యూసీ యమునా బేసిన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జి.కె.అగర్వాల్‌ను గోదావరి నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. సీడబ్ల్యూసీ కావేరీ అండ్‌ సదరన్‌ రీజియన్‌ ఆర్గనైజేషన్‌ (కోయంబత్తూరు) చీఫ్‌ ఇంజనీర్‌ టి.కె.శివరాజన్, సీడబ్ల్యూసీ అప్పర్‌ గంగా బేసిన్‌ ఆర్గనైజేషన్‌ (లక్నో) చీఫ్‌ ఇంజనీర్‌ అనుపమ్‌ ప్రసాద్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో నియమించింది. ఈ నలుగురు అధికారులు ఆయా బోర్డుల చైర్మన్‌కు తక్షణం రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పొందుపరిచిన ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని సూచించింది. రెండు బోర్డులకు అత్యంత ప్రాధాన్యం గల అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ నియామకాలు మూడు నెలల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ అధికారులు చీఫ్‌ ఇంజనీర్ల స్థాయిలో పూర్తి అధికారాలతో ఫుల్‌ టైమ్‌ పనిచేస్తారని తెలిపింది. 

గెజిట్‌ అమలుపై బోర్డుల చైర్మన్లతో చర్చ
కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎం.పి.సింగ్, జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌లతో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. గత శుక్రవారం జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా కొనసాగింపుగా అదనపు కార్యదర్శి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బోర్డుల పరిపాలనా సంబంధిత అంశాలు, నోటిఫికేషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపిన అభ్యంతరాలు, గెజిట్‌ అమలులో ఇబ్బందులు, మానవ వనరులు తదితర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ ౖచైర్మన్‌ ఎస్‌.కె.హల్దర్,  ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top