విశాఖలో ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం!

APERC Camp Office in Visakhapatnam - Sakshi

ఈపీడీసీఎల్‌ ఆవరణలో ఏర్పాటుకు నిర్ణయం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) క్యాంపు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) కార్పొరేట్‌ కార్యాలయ ఆవరణలో ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్‌ నుంచే ఏపీఈఆర్‌సీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ చార్జీల టారిఫ్‌పై కూడా విశాఖపట్నం నుంచే ఆన్‌లైన్‌ ద్వారా ఏపీఈఆర్‌సీ విచారణ జరిపింది.

ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే ఇక్కడి నుంచి ఈఆర్‌సీ ఏడాదిలో కొద్దిరోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్‌రంగంలో విద్యుత్‌ చార్జీల నిర్ణయంతో పాటు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఈఆర్‌సీ పాత్ర కీలకమైంది. అటువంటి ఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటైతే.. విశాఖ కాస్తా విద్యుత్‌రంగ కార్యకలాపాలకు వేదికగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top