పోలవరం అపరిష్కృత  అంశాలపై ఒత్తిడికి  జలవనరుల శాఖ సన్నద్ధం 

AP Water Resources Department Put Pressure On Centre Over Polavaram Unresolved Issues - Sakshi

రూ.55,656.87 కోట్లకు తక్షణమే పెట్టుబడి అనుమతి ఇవ్వాలి 

జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు నీటిపారుదల వ్యయం కూడా చెల్లించాలి 

ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ నిధుల విడుదలతో పనుల్లో జాప్యం నివారణ 

16 జాతీయ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షకు నేడు హైపవర్‌ కమిటీ భేటీ 

సాక్షి, అమరావతి:  పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అపరిష్కృత సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ నేతృత్వంలో సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో జరిగే హైపవర్‌ కమిటీ సమావేశంలో పోలవరం సమస్యలను పరిష్కరించేలా పట్టుబట్టాలని ఉన్నతాధికారులకు జలవనరుల శాఖ దిశానిర్దేశం చేసింది.

2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ (పెట్టుబడి అనుమతి) జారీ చేయడం, మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే నీటిపారుదల విభాగం కింద నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ చేసేలా గట్టిగా కోరేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సన్నద్ధమయ్యారు.

దేశంలో జాతీయ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించడం, సమస్యలు పరిష్కరించి గడువులోగా పనులు పూర్తి చేసేందుకు 2008 ఫిబ్రవరి 7న కేంద్రం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి జల్‌ శక్తి శాఖ కార్యదర్శిని ఛైర్మన్‌గా నియమించింది. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు హైపవర్‌ కమిటీ తాజాగా సమావేశమవుతోంది. 
 
పెట్టుబడి అనుమతే ప్రధానం.. 
విభజన చట్టం ప్రకారం పోలవరం వ్యయాన్ని వంద శాతం కేంద్రమే భరించాలి.  2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) సాంకేతిక సలహా కమిటీ ఆమోదించింది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ను ఏర్పాటు చేసిన సమయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పెట్టుబడి అనుమతిని సంబంధిత శాఖే ఇవ్వాలి.

ఈ నేపథ్యంలో రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి 2020 డిసెంబర్‌ 30న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇందుకు అనుగుణంగా తక్షణమే పెట్టుబడి అనుమతి జారీ చేసి నిధులు విడుదల చేయాలని హైపవర్‌ కమిటీపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఒత్తిడి తేనున్నారు. 
 
సీడబ్ల్యూసీ, కేంద్ర జల్‌ శక్తి ఓకే చెప్పినా.. 
జాతీయ ప్రాజెక్టుల్లో నీటిపారుదల, సరఫరా వ్యయం ఒక్కటేనని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. పోలవరానికీ అదే రీతిలో నిధులివ్వాలని సీడబ్ల్యూసీతోపాటు జల్‌ శక్తి శాఖ కూడా తేల్చి చెప్పినా కేంద్ర ఆర్థిక శాఖ తోసిపుచ్చుతోంది. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటిపారుదల, సరఫరా విభాగం వ్యయాన్ని ఇవ్వాలని హైపవర్‌ కమిటీని రాష్ట్ర జలవనరుల అధికారులు గట్టిగా కోరనున్నారు. 
 
ఎప్పటికప్పుడు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి.. 
పోలవరం హెడ్‌ వర్క్స్, కుడి కాలువ, ఎడమ కాలువ, భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ విభాగాలతో నిమిత్తం లేకుండా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని గుంపగుత్తగా పరిగణించి ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలో నిధులివ్వాలని జలవనరుల శాఖ అధికారులు కోరనున్నారు. పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,372.14 కోట్లను ఖర్చు చేసింది.

ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.13,641.43 కోట్లు వ్యయం చేసింది. వాటిలో రూ.11,492.16 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసింది. ఇంకా రూ.2,149.27 కోట్లను కేంద్రం బకాయిపడింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ చేయడం ద్వారా ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రానికి మరోసారి వి/æ్ఞప్తి చేయనున్నారు. 

16 జాతీయ ప్రాజెక్టులు ఇవీ.. 
ప్రాజెక్టు పేరు                రాష్ట్రం 
1.గోషికుర్ద్‌                    మహారాష్ట 
2.షాపూర్‌ఖండి                పంజాబ్‌ 
3.తీష్టా బ్యారేజ్‌                పశ్చిమ్‌బంగా 
4.రేణుకాజీ                    హిమాచల్‌ప్రదేశ్‌ 
5.లక్షవర్‌ వ్యాసీ                ఉత్తరాఖండ్‌ 
6.కిషావ్‌                    హిమాచల్‌ప్రదేశ్‌/ఉత్తరాఖండ్‌ 
7.కెన్‌–బెట్వా                మధ్యప్రదేశ్‌/ఉత్తరప్రదేశ్‌ 
8.బుర్‌శార్‌                    జమ్మూ కశ్మీర్‌ 
9.జిష్పా                    హిమాచల్‌ప్రదేశ్‌ 
10.రావి వ్యాస్‌ లింక్‌                పంజాబ్‌ 
11.ఊజ్‌                    జమ్మూ కశ్మీర్‌ 
12.కుల్శీ డ్యామ్‌                అస్సాం 
13.నోయ్‌–డిహింగ్‌ డ్యామ్‌            అరుణాచల్‌ప్రదేశ్‌ 
14.అప్పర్‌ శియాంగ్‌                అరుణాచల్‌ప్రదేశ్‌ 
15.సరయునహర్‌ పరియోజన        ఉత్తరప్రదేశ్‌ 
16.పోలవరం                ఆంధ్రప్రదేశ్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top