
సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు.
సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి
అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు.

ఖండించిన పాత్రికేయులు
ఏపీలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని పాత్రికేయులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజాసంఘాలతో పాటు ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను నిగ్గదీసి అడుగుతున్నందుకు, కక్ష గట్టి ప్రజల గొంతును నొక్కాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కూటమి సర్కారు ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. సాక్షిపై కక్ష సాధింపు చర్యలను పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
