
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనంతరం 18 ఏళ్లు దాటిన వారిలో కనీసం ఒక డోసు టీకా తీసుకున్న వారు 21.1 శాతానికి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే 13,72,481 మందికి టీకాలు అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో 12,85,394 మందికి తొలి డోసు ఇవ్వగా 87,087 మందికి రెండో డోసు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 45 సంవత్సరాలు దాటిన 8.14 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఐదేళ్లలోపు పిల్లలున్న 5.05 లక్షల మంది తల్లులకు టీకాలు ఇచ్చారు. 48,462 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, 3681 మంది హెల్ల్ కేర్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ఒకే రోజు వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ తన రికార్డులను తానే అధిగమించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 14న నెలకొల్పిన 6,32,780 టీకాల రికార్డును ఏపీ తిరగరాసింది. దేశవ్యాప్తంగా ఒకరోజు వ్యాక్సినేషన్‌లో టాప్ 5 రాష్ట్రాల రికార్డులను చూస్తే అందులో మూడు ఆంధ్రప్రదేశ్ పేరుతోనే ఉండటం గమనార్హం.
పలు దేశాల కంటే మెరుగ్గా..
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన వివిధ దేశాల కంటే ఎన్నో రెట్లు అధికంగా వ్యాక్సినేషన్ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నిరూపించింది. ఇంగ్లాడ్‌లో రోజుకు సగటున 4 లక్షల డోసులు, జర్మనీలో 3.7 లక్షలు, జపాన్‌లో 1.6 లక్షలు, రష్యాలో 2.2 లక్షలు, కెనడాలో 1.76 లక్షలు, దక్షిణ కొరియాలో రోజుకు లక్ష చొప్పున వ్యాక్సినేషన్ జరుగుతోంది. అమెరికాలో రోజుకు సగటున 16 లక్షల డోసులు, భారత్‌లో సగటున 15 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరుగుతుండగా అదే స్థాయి సామర్థ్యాన్ని ఇప్పుడు రాష్ట్రం సాధించిందని, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే రోజుకు 15 లక్షలు ఇవ్వగలమని ఈ డ్రైవ్‌ద్వారా రుజువు చేసినట్లు ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ ఆర్జా శ్రీకాంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 22.9 శాతం వ్యాక్సినేషన్ జరిగింది. శ్రీకాకుళం (22.4), నెల్లూరు (21.8), పశ్చిమ గోదావరి (21.5), వైఎస్‌ఆర్ కడప (21.5), కృష్ణా (21) జిల్లాల్లో వ్యాక్సినేషన్ నమోదైంది.
దేశంలో టాప్ 10 వ్యాక్సినేషన్ రాష్ట్రాలు
డోసులు తేదీ రాష్ట్రం
13,72,481 20/06 ఏపీ
6,32,780 14/04 ఏపీ
5,85,267 16/06 బిహార్
5,79,161 27/05 ఏపీ
5,41,923 16/04 మహారాష్ట్ర
5,25,916 07/04 రాజస్థాన్
5,19,624 03/04 గుజరాత్
5,13,489 05/04 ఉత్తరప్రదేశ్
5,08,995 12/04 ఉత్తరప్రదేశ్
5,03,124 14/06 మధ్యప్రదేశ్
జిల్లాలవారీగా 20న రికార్డ్ వ్యాక్సినేషన్ ఇలా..
జిల్లా మొత్తం డోసులు తొలిడోసు రెండో డోసు
ప.గోదావరి 1,67,494 1,65,954 1540
తూ.గోదావరి 1,55,591 1,51,748 3,843
కృష్ణా 1,41,848 1,32,828 9,020
విశాఖపట్నం 1,11,893 1,04,340 7,553
గుంటూరు 1,06,795 95,989 10,806
ప్రకాశం 1,04,857 98,068 6,789
చిత్తూరు 1,03,011 91,632 11,379
అనంతపురం 89,293 82,364 6,929
శ్రీకాకుళం 88,564 81,239 7,325
నెల్లూరు 79,419 70,897 8,522
కర్నూలు 79,235 75,314 3,921
వైఎస్సార్ కడప 79,063 71,338 7,725
విజయనగరం 65,418 63,683 1,735
మొత్తం 13,72,481 12,85,394 87,087