
సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధాని’ కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి ఆదేశాలను ఏ కోర్టు కూడా ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలాంటి అభ్యర్థనను పలు హైకోర్టులు ఇప్పటికే తిరస్కరించాయని హైకోర్టు రిజిస్ట్రార్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. అలా అయితే ఆ తీర్పులన్నింటినీ తమ ముందుంచాలని ధర్మాసనం అశ్వనీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలతోపాటు రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో జరగబోయే తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా తగిన మార్గదర్శకాలను రూపొందించేలా రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన వేమూరు లీలాకృష్ణ హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
► మరో కేసులో... పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ తన వాదనలను ముగించారు. ఆయన వరుసగా మూడు రోజులపాటు వాదనలు వినిపించారు. హైకోర్టు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
► రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తన బాధ్యతను విస్మరిస్తోందని హైకోర్టుకు సీపీఎం నివేదించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్లు అన్ని రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు కౌంటర్ దాఖలు చేశారు.