
విజయవాడ, సాక్షి: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి ఒడిశాతో ఏపీకి రాకపోకలు బంద్ అయ్యాయి. కోస్తా తీరం అతలాకుతలం అవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంటోంది.
ఈ తరుణంలో ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి మళ్లీ వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది.