కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ సర్కార్‌ నిర్ణయం

AP Govt Decision On Handing Over Projects To Krishna Board - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణాబోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల నుంచి నేరుగా నీటిని తీసుకునే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ కేంద్రాలను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. శ్రీశైలం, సాగర్‌ల కింద తెలంగాణ పరిధిలోని 9 అవుట్‌లెట్లను స్వాధీనం చేసుకున్నప్పుడే తమ భూభాగంలోని 6 అవుట్‌లెట్లను స్వాధీనం చేసుకోవాలని కృష్ణాబోర్డుకు షరతు పెట్టింది. శ్రీశైలం స్పిల్‌వే, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం (మల్యాల పంపు హౌన్‌), ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు.

శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణ సర్కిల్‌ ఆఫీస్‌ సిబ్బంది 39 మంది,  శ్రీశైలం సెక్షన్‌ ఆఫీసు, సబ్‌ డివిజన్‌ ఆఫీసుకు చెందిన సిబ్బంది 142 మంది.. మొత్తం 181 మంది సిబ్బందిని కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రాన్ని, నాగార్జున్‌సాగర్‌ కుడికాలువపై ఉన్న విద్యుత్‌ కేంద్రాన్ని కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీచేశారు.

తెలంగాణలోని శ్రీశైలం, సాగర్, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం, సాగర్‌ స్పిల్‌వే, సాగర్‌ కుడికాలువ హెడ్‌ రెగ్యులేటర్, ఎడమకాలువ హెడ్‌ రెగ్యులేటర్, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్‌ కేంద్రం, సాగర్‌ ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, సాగర్‌ వరద కాలువలను బోర్డు స్వాధీనం చేసుకున్నప్పుడే తమ ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకోవాలని  ఏపీ ప్రభుత్వం షరతు విధించింది. అలాగే శ్రీశైలం ఎగువన జూరాల ప్రాజెక్టుతోపాటు, దానిపై అవుట్‌లెట్ల నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కృష్ణాబోర్డును కోరింది.

వాటిని స్వాధీనం చేసుకోకపోతే దిగువనున్న శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులకు వచ్చే ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాన రిజర్వాయర్లపై నేరుగా నీటిని తీసుకునే ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. స్వాధీనం సందర్భంగా అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ, జెన్‌కో సీఈలు బోర్డుకు సహకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది.  

చదవండి:
‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top