Dragon Fruit: ఎంటర్‌ ది ‘డ్రాగన్‌’

AP Government Support For Dragon Fruit Cultivation - Sakshi

డ్రాగన్‌ ఫ్రూట్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

ఉపాధిహామీలో అర ఎకరం సాగుకు అనుమతి

మూడేళ్లు నిర్వహణ ఖర్చులు

రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం 

డ్రాగన్‌ ఫ్రూట్‌. మంచి  పోషకాలు ఉన్న పండు. గిరాకీ కూడా ఎక్కువే. ఈ ఫల సేద్యం కృష్ణా జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు అక్కడక్కడా సాగుచేస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధమైంది.

నూజివీడు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉపాధి హామీ పీడీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మామిడి, నిమ్మ, జామ, సపోట తదితర పండ్లతోటలకు సర్కారు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇక నుంచి డ్రాగన్‌ ఫ్రూట్‌నూ ఈ జాబితాలో చేర్చింది. ఆసక్తికల రైతులు ఉపాధి హామీ పథకం ఏపీఓలను సంప్రదించి డ్రాగన్‌ సాగు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

జిల్లాలోనూ పైలెట్‌ ప్రాజెక్టుగా..
ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టేందుకు రాష్ట్రంలో పలు జిల్లాలను పైలెట్‌ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో  కృష్ణా జిల్లా కూడా ఉంది. పథకం అమలుకు మార్గదర్శకాలూ విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు అర ఎకరా విస్తీర్ణంలో సాగుకు అనుమతిస్తారు. దీనికి ముందుకు వస్తే రైతుకు రూ.1.86 లక్షలను ఇస్తారు. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులనూ చెల్లిస్తారు. మొక్కల ఖరీదులోనూ సగం రైతులు పెట్టుకుంటే మిగిలిన సగం ప్రభుత్వం భరిస్తుంది. అర ఎకరాకు దాదాపు 350 మొక్కలు 
అవసరమవుతాయి.

డిమాండ్‌ ఎక్కువ 
మంచి పోషకాలు కలిగిన డ్రాగన్‌ఫ్రూట్‌కు మార్కెట్‌లోనూ డిమాండ్‌ బాగా ఉంది. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్‌ఫ్రూట్‌ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్‌ మాల్స్‌లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది. ఒక్కొక్క డ్రాగన్‌ ఫ్రూట్‌ ధర రూ.100 పలుకుతోంది. ఈ ఫలంలో రెండు రకాలు ఉన్నాయి. ఒక రకానికి లోపలి భాగం తెలుపురంగులో మరో రకానికి ఎరుపు రంగులోనూ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఫలానికే డిమాండ్‌ ఎక్కువ. వీటిల్లో విటమిన్‌–సీ, విటమిన్‌–బీ3తో పాటు ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బొహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధి నియంత్రణకు దోహదపడుతుంది.

ఏడాదికల్లా కాపు  
మొక్కలు నాటిన తరువాత ఏడాది కల్లా కాపు వస్తుంది. 30 ఏళ్లు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి మూడు కాపులు వస్తాయి. ప్రారంభంలో ఒక్కొక్క చెట్టుకు పది కాయలు కాస్తాయి. రానురాను దిగుబడి మరింత పెరుగుతుంది. డ్రాగన్‌ ఎడారి మొక్కైన నాగజెముడు, బ్రహ్మజెముడులాగా నీరు తక్కువగా ఉన్నా బతుకుతుంది. చౌడు భూములు మినహా మిగిలిన నేలల్లో దీనిని సాగుచేసుకోవచ్చు.

రైతులు ఆసక్తి చూపాలి  
 డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. అర ఎకరం వరకు సాగు చేసుకుంటే ఉపాధిహామీ పథకం నుంచి నిధులను ఇస్తుంది. ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకుని ముందుకు రావాలి.   
– జీవీ సూర్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top