సీఎం క్యాంప్‌ కార్యాలయం ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు | AP Government reported to High Court about CM camp office | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంప్‌ కార్యాలయం ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు

Oct 11 2020 4:00 AM | Updated on Oct 11 2020 4:00 AM

AP Government reported to High Court about CM camp office - Sakshi

సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సీఆర్‌డీఏ చట్టంలో, ఈ చట్టం కింద నోటిఫై చేసిన మాస్టర్‌ ప్లాన్‌లో సీఎం క్యాంపు కార్యాలయం గురించి స్పష్టమైన నిర్వచనం, ప్రస్తావనేవీ లేవంది. ప్రతి జిల్లాలో తనకు నచ్చిన వసతిని క్యాంపు కార్యాలయంగా మార్చుకునే స్వేచ్ఛ సీఎం కార్యాలయానికి ఉందని తెలిపింది.

ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయాలని సీఎంను ఒత్తిడి చేసే హక్కు పిటిషనర్లకు లేదంది. అలాగే జిల్లాల్లో దేన్నీ క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోకూడదని చెప్పే హక్కు కూడా వారికి లేదని స్పష్టం చేసింది. అమరావతి నుంచి రాజ్‌భవన్, సచివాలయం, ఇతర శాఖా«ధిపతుల కార్యాలయాలను, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ను విశాఖపట్నంకు తరలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 6న విచారణ జరిపింది.

ఈ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం సీఎం క్యాంపు కార్యాలయం అంటే ఏంటి? అది ఎక్కడ ఉండాలని ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగింది. ఈ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు కౌంటర్‌ దాఖలు చేశారు.

హైకోర్టు ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వులు కేవలం సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న కార్పొరేషన్లకే వర్తిస్తాయని కౌంటర్‌లో పేర్కొన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో విజయవాడ, గుంటూరుల్లో ఏపీ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్, ఏపీ రాజీవ్‌ స్వగృహ, ఏపీఎండీసీ, ఏపీటీడీసీ, ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్, ఏపీ బేవరేజస్, ఏపీ స్టేట్‌ మైనారిటీ ఫైనాన్స్, ఏపీ స్టేట్‌ క్రిస్టియన్‌ (మైనారిటీస్‌) ఫైనాన్స్, ఏపీ సేŠట్‌ట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్లు, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీ, తదితరాలు ఉన్నాయన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement