సరైన సమయంలో ‘స్థానిక’ ఎన్నికలు | AP Assembly Session 2020: Alla Nani Comments On Local Body Elections | Sakshi
Sakshi News home page

సరైన సమయంలో ‘స్థానిక’ ఎన్నికలు

Dec 5 2020 3:21 AM | Updated on Dec 5 2020 6:34 AM

AP Assembly Session 2020: Alla Nani Comments On Local Body Elections - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితులు లేవని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పడు వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన నిబంధనలు ఉండేలా ఏపీ పంచాయతీరాజ్‌ యాక్ట్‌–1994లో మార్పులు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.

రాష్ట్రంలో ఇంకా కరోనా ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడే నిర్వహించడం ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని నిపుణులు, మీడియా ప్రతినిధులు సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా సెకండ్‌ వేవ్‌ను అడ్డుకోవడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల వివరాలను అడుగుతోందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌ సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు మరికొందరు చేస్తున్న వాదనలు సరికాదన్నారు. 

ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుంది..
ఇప్పటికే కరోనా వల్ల రాష్ట్రంలో 7,014 మంది మరణించారని ఆళ్ల నాని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలో ప్రాణాలు విడిచిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలను వృథా కానీయరాదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టిందని, ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడతాయని శాసనసభ భావిస్తోందన్నారు. తీర్మానంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ నాయకత్వంలో అధికారులందరూ కరోనాపై పోరాడుతున్నారని, ఏ పాలకుడికైనా ప్రజల ధన, మాన, ప్రాణాలే ముఖ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సరైన సమయంలో నిర్వహిస్తామని.. దీనికోసం పంచాయతీరాజ్‌ యాక్ట్‌లో నిబంధనలను మారుస్తున్నామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement