మరో మావోయిస్టు కీలక నేత అరెస్టు
12ఏళ్ల వయసులోనే దళంలోకి సరోజ్ మడవి
కొంత కాలంగా కోనసీమలోనే మకాం
ఆక్వా చెరువు వద్ద గుమాస్తాగా జీవనం
అంతకు ముందే హిడ్మా వద్దకు వెళ్లిన సరోజ్ మడవి..
ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని తిరిగి వస్తుండగా అరెస్టు
రావులపాలెం: మరో మావోయిస్టు కీలకనేత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీసులకు చిక్కారు. ఆ వివరాలను రావులపాలెం సీఐ శేఖర్‌బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ మడవి (అలియాస్) మడ్వీ హంధాను రావులపాలెం గౌతమి గోదావరి డంపింగ్ యార్డ్ వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బుంద్లేలంక కిష్ట్రారం పోలీస్ స్టేషన్ పరిధిలో సుక్మా జిల్లాకు చెందిన సరోజ్ మడవి ఐదో తరగతి వరకు చదివారు. 12 ఏళ్ల వయసులో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై దళంలో చేరారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఎటపాక మావోయిస్టుల సౌత్ డివిజన్ కమాండర్ ఇన్‌చార్జిగా ఉన్న ముచాకీ ఎర్రా అలియాస్ ఎర్ర దాదా వద్ద కమ్యూనికేషన్ కమాండర్‌గా ఉన్నారు.
2021 నుంచి వివిధ దాడుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని కోనసీమకు రాగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక గన్, పది తూటాలు స్వాదీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కొత్తపేట కోర్టులో హాజరుపరచారు. కాగా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు సరోజ్ మడవి సన్నిహితుడు.
హిడ్మాకు అనుంగు అనుచరుడు
కోనసీమను తలదాచుకోవడానికి సురక్షిత ప్రాంతంగా మావోయిస్టులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సరోజ్ మడవి కొంత కాలం క్రితం సఖినేటిపల్లి వచ్చి అక్కడ ఆక్వా చెరువు వద్ద గుమస్తాగా చేరి జీవనం సాగిస్తున్నట్టు సమాచారం.
కోనసీమలో ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు, పోలీసులు అతని సెల్ సిగ్నల్ ట్రాక్ చేయడం ద్వారా కనిపెట్టారు. హిడ్మాకు అనుంగు అనుచరుడు. ఎన్‌కౌంటర్‌కు ముందే హిడ్మా వద్దకు వెళ్లిన సరోజ్.. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమవడంతో అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి కోనసీమలో తలదాచుకోవడానికి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.


