ఏడాదిన్నర పాలనలో రైతులను నిలువునా ముంచేశారు
అన్నదాత సుఖీభవ పేరుతో రూ.17 వేల కోట్లు ఎగ్గొట్టారు
7 లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి వెన్నుపోటు
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపచేయడం లేదు
మాజీ మంత్రి కురసాల కన్నబాబు
సాక్షి, అమరావతి: అబద్ధాలు, క్రెడిట్ చోరీలతో తనను తాను మేధావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీమంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కడప జిల్లాలో రెండోవిడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై మండిపడ్డారు. ఈ ఒక్క పథకం ద్వారానే రెండేళ్లలో రైతులకు దాదాపు రూ.17 వేల కోట్లు మోసం చేశారన్నారు.
ఏకంగా 7 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని నమ్మించి.. ఎన్నికల్లో గెలిచాక రెండేళ్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించడం లేదని, ఏడాదిన్నర కూటమి పాలనలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్న పాపాన పోలేదని చెప్పారు.
పంచ సూత్రాలు కాదు.. పచ్చి అబద్ధాలు
‘ఈ–క్రాప్ చేయడం చేతకాని వ్యక్తి చంద్రబాబు వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తానని చెబుతున్నారు. గడచిన ఐదేళ్లూ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌ది అయితే, అకౌంట్‌లో నగదు వేసే విధానం తానే తీసుకొచ్చానని చంద్రబాబు సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. పంచసూత్రాల పేరుతో ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే.
వైఎస్సార్‌సీపీ హయాంలో సీఎం యాప్‌ను తీసుకొచ్చి రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేస్తే.. చంద్రబాబు కొత్తగా యాప్ తీసుకొస్తానని చెబుతున్నాడు. గ్రోమోర్ సెంటర్‌ను చూసి ఆదర్శంగా ఉందని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు అండగా అద్భుతంగా పనిచేసిన ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేశారు.
ఏపీలో అమలవుతున్న ఆర్బీకే వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నీతిఆయోగ్ సూచిస్తే, వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే అక్కసుతో దానిని నిర్వీర్యం చేసి రైతులను నిలువునా ముంచిన నీచుడు చంద్రబాబు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చి అరటి, దానిమ్మ వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అలాంటి మంచి పనులకు తన స్టాంప్ వేసుకుని చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు’ అని కన్నబాబు మండిపడ్డారు.
ఏడాదిన్నరలో రైతులకు చేసింది శూన్యం
‘రైతులకు ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలో చేసింది శూన్యం. రైతుల అప్పుల గురించి మాట్లాడమంటే యాప్‌ల గురించి చెబుతున్నారు. నకిలీ విత్తనాలతో శ్రీకాకుళం జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతే చంద్రబాబుకి చీమకుట్టినట్టయినా లేదు. ధరలు పతనమై రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం ఎక్కడా కలగజేసుకుని ఆదుకున్న దాఖలాలు లేవు. మామిడి, మిరప, చెరకు రైతులను ఆదుకుంటామని చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయి.
రైతులకు మేలు జరిగేలా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత పంటల బీమా పథకాన్ని, రైతులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించే అవసరం లేకుండా అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైఎస్సార్‌సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.67,500 చొప్పున జమ చేశారు.
ఐదేళ్లలో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.34,378 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. చంద్రబాబు హామీ మేరకు రెండేళ్లలో రైతుల ఖాతాల్లో రూ.21,433 కోట్లు జమ చేయాల్సి ఉంటే.. రూ.5 వేల చొప్పున 46.85 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో ఇచ్చిన మొత్తం కేవలం రూ.4,685 కోట్లు మాత్రమే. రెండేళ్లలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.16,746 కోట్లు కూటమి ప్రభుత్వం బకాయి పడింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి కౌలు రైతులను చంద్రబాబు దూరం చేశారు’ అని కన్నబాబు పేర్కొన్నారు.


