లోన్‌ యాప్‌ల మాయలో పడి మోసపోవద్దు 

Annamayya District SP Harshavardhan Raju Comments On Loan Apps - Sakshi

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు  

రాయచోటి :  సెల్‌ఫోన్ల వినియోగంలో భాగంగా లోన్‌ యాప్‌ల మాయలో పడి ప్రజలు మోసపోవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు హితబోధ చేశారు. శనివారం ఈ మేరకు ఎస్పీ ఒక ప్రకటనల విడుదల చేసి సైబర్‌ నేరాలపై స్పందించారు. లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు పొంది వారి వేధింపులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.

సైబర్‌ మోసగాళ్లు సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, వ్యాపారస్తులు రుణయాప్‌లకు ఆకర్షితులవుతున్నారన్నారు. రుణాలు తీసుకున్నాకా అధిక వడ్డీ, అనేక అసంబంధమైన చార్జీల పేరిట యాప్‌ నిర్వాహకులు రుణగ్రహీతల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు రుణాలు తిరిగి చెల్లించే విషయంలో యాప్‌ నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, రుణగ్రహీతల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

వారి ఫోన్ల నుండి సేకరించిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీలమైన ఫొటోలు, వీడియోలను వారి ఫోన్లోని కాంటాక్ట్‌ నెంబర్లకు పంపించి వేధిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్‌ నుంచి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వివరించారు. ప్రజలు కేవలం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలని సూచించారు.

నకిలీ యాప్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రుణాల విషయంలో వేధింపులకు గురిచేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930కు కాల్‌ చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top