
అసలు కంటే యాప్‌ల పనే ఎక్కువంటూ అంగన్‌వాడీ కార్యకర్తల ఆగ్రహం
స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై సంపూర్ణ అవగాహన లేని వైనం
విధి నిర్వహణలో ఒత్తిడితో తీవ్ర అసహనం
సీడీపీఓకు 2జీ సెల్‌ఫోన్లు అప్పగింత
కొత్త ఫోన్లు ఇచ్చే వరకూ ‘నో ఫోన్.. నో వర్క్’
రాజమహేంద్రవరం రూరల్: టెన్త్ కనీస విద్యార్హతతో విధుల్లో చేరిన వారే అంగన్‌వాడీ కార్యకర్తలు. గ్రామీణ ప్రాంత కార్యకర్తల్లో అత్యధికులకు స్మార్ట్ ఫోన్ వినియోగం పూర్తి స్థాయిలో తెలియదు. అలాంటి వీరితో ఒకే పనిని పలుమార్లు యాప్‌ల్లో నమోదు చేయాలన్న సర్కార్ ఆదేశాలతో, వారి ప్రధాన విధి అయిన ప్రీ స్కూల్ బోధన పక్కదారి పడుతోంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన 2జీ సెల్‌ఫోన్లతోనే ఇప్పుడూ పలు యాప్‌ల్లో నమోదు చేయిస్తున్నారు.
ఆ ఫోన్లలో యాప్‌ల వల్ల నెట్‌వర్క్ పనిచేయక పోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు వారి సొంత ఫోన్లలో యాప్‌లు డౌన్‌లోడ్ చేసి, నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త 5జీ సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో చేసేది లేక అంగవాడీ కార్యకర్తలు జిల్లాలో మూకుమ్మడిగా సెల్‌ఫోన్లను సీడీపీవో కార్యాలయాల్లో తిరిగిచ్చేశారు. కొత్త ఫోన్లు ఇచ్చేవరకూ ‘నో ఫోన్.. నో వర్క్’ విధానం పాటిస్తామని కుండ బద్దలు కొట్టారు. ప్రీ స్కూలు విధులు నిర్వహిస్తూ, రికార్డులు మాత్రమే రాస్తామని చెబుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబి్ధదారులకు పోషకాహారం సరఫరా వివరాలను ప్రత్యేక యాప్‌ల్లో పలుమార్లు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోషణ్ ట్రాకర్ యాప్‌లో ముఖ గుర్తింపు వ్యవస్థ(ఎఫ్‌ఆర్‌ఎస్)/బయోమెట్రిక్ తప్పనిసరి. దీంతో నెట్‌వర్క్ సరిగా పని చేయకపోయినా, లబి్ధదారుల మొబైల్స్‌కు మెసేజ్ బ్యాలన్స్ లేక ఓటీపీ రాకపోయినా సరకులు అందించలేని పరిస్థితి. దీంతో తమతో పాటు, లబ్ధిదారులు కూడా తిప్పలు పడాల్సి వస్తోందని కార్యకర్తలు వాపోతున్నారు.
టీహెచ్‌ఆర్‌తో తిప్పలు
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు, ఆరు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు ప్రతి నెలా పోషకాహారాన్ని ఇంటికే అందిస్తున్నారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాల వద్దే ఇచ్చేవారు. దీనిని గతంలోనే టేక్ హోమ్ రేషన్(టీహెచ్‌ఆర్)గా మార్చి, పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పు దినుసులు, బియ్యం వంటివి ప్రతి నెలా రెండు సార్లు అందిస్తున్నారు.
రెండు సార్లు పోషక్ ట్రాకర్ యాప్‌లో వివరాల నమోదుకే ఎక్కువ సమయం పడుతుంది. బయోమెట్రిక్ ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. చాలాసార్లు ఈ నమోదుకే ఒక్కో లబి్ధదారుకు అరగంటకు పైనే పడుతోందని, దీంతో పిల్లలకు ప్రాథమిక విద్య, బోధన ఇబ్బందికరంగా మారిందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులకు సెల్‌ఫోన్ల అప్పగింత!
యాప్‌లతో పనిచేయని ఫోన్లను సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ‘నో ఫోన్.. నో వర్క్’ పేరుతో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో సీడీపీవోలకు అప్పగించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ, కొత్త ఫోన్లు అందించే వరకూ సెల్‌ఫోన్లతో పని చేయబోమని అంగన్‌వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. త్వరలో కొత్త సెల్‌ఫోన్లను ప్రభుత్వం ఇస్తుందని అధికారులు చెప్పినప్పటికీ.. ఫోన్లు తీసుకెళ్లేది లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు భీష్మించారు.
నెట్‌వర్క్ సమస్య కూడా..
తూర్పు గోదావరి జిల్లాలో చాలా వరకు గ్రామీణ ప్రాంతం కావడంతో మొబైల్ నెట్‌వర్క్ సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం అందించిన తక్కువ సామర్థ్యం(ర్యామ్) ఫోన్లలో యాప్‌ల పనితీరు దారుణంగా ఉంది. ఈ క్రమంలో యాప్‌లు మొరాయించడం సర్వసాధారణంగా మారింది. దీంతో పిల్లలకు ప్రీ స్కూల్ బోధన దాదాపు అటకెక్కుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు యాప్‌ల వల్ల ఫోన్లు పనిచేయడం లేదని, 5జీ ఫోన్లు లేదా ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు అంగన్‌వాడీ కార్యకర్తల యూనియన్ నేతలతో భేటీ కూడా కాలేదు. సెల్‌ఫోన్ల సమస్యతో పాటు, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు సైతం పెంచకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
యాప్‌లతో ఒత్తిడికి గురవుతున్నాం
పాత సెల్‌ఫోన్లలో యాప్‌ల వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నెట్‌వర్క్ సరిగా పని చేయకపోవడంతో ఒక్కో నమోదు అర గంటకు పైగా పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5జీ సెల్‌ఫోన్లు లేదా ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు జీతాలు కూడా పెంచడం లేదు. – యాళ్ల బేబీరాణి, తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, తూర్పు గోదావరి
పని పెరిగి.. బోధన తగ్గి..
ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 15 వరకూ రికార్డులు నిర్వహిస్తున్నారు. లబ్దిదారులకు అందించే ఆహార వినియోగం (ఎఫ్‌సీఆర్), పిల్లలు, బాలింతలు, గర్భిణుల నమోదు, ప్రీ స్కూల్ అడ్మిన్ రికార్డులను ప్రతి రోజూ విధిగా నమోదు చేయాలి. మరోవైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్–ఎ రికార్డు, రిఫరల్ సర్వీసెస్, గృహ సందర్శకుల రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్‌హోల్డ్ సర్వే రికార్డు, గ్రోత్ చార్ట్ తదితర వ్యవహారాలతో పాటు, ఇప్పుడు యాప్‌లు అదనం. ఈ యాప్‌ల్లో నమోదు ప్రక్రియ మరింత కష్టంగా మారింది.