తాగునీటి పరీక్షల్లో మనమే ముందు

Andhra Pradesh Tops In drinking water tests - Sakshi

5 నెలల్లో 1.63 లక్షల నమూనాల పరీక్ష 

సురక్షితమని నిర్ధారించుకున్నాకే సరఫరాకు అనుమతి 

దేశంలో మొత్తం 8.78 లక్షల నమూనాల పరీక్ష  

మిగిలిన పెద్ద రాష్ట్రాల్లోనూ లక్షలోపే పరీక్షలు 

వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే బోర్లు, ఇతర స్టోరేజీ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన నీరు ఫ్లోరైడ్‌ వంటి ఇతర ప్రమాదకర కారకాలు లేకుండా సురక్షితమైనదేనా అని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నీటి వనరులో నమూనాకు ఏటా నాణ్యత పరీక్షలు చేస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు చివరి వరకు (5 నెలల్లో) దేశం మొత్తంలో 8,78,667 నీటి నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అందులో దాదాపు ఐదోవంతు అంటే 1,63,065 నమూనాల పరీక్షలు మన రాష్ట్రంలో నిర్వహించినవే. పలు పెద్ద రాష్ట్రాలతో సహా దేశంలోని మిగిలిన వాటిలో మరే రాష్ట్రంలోను లక్షకు మించి నీటి నాణ్యత పరీక్షలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ వివరాలను తమ వెబ్‌ పోర్టల్‌లో తెలిపింది.

రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) విభాగం ఆధ్వర్యంలో మొత్తం 112 నీటినాణ్యత పరీక్ష కేంద్రాలున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒకటి, ప్రతి జిల్లా కేంద్రంలోను, డివిజన్‌ కేంద్రంలోను ఒకటి వంతున ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటివనరుల నుంచి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఇప్పటివరకు 1,81,518 నీటి నమూనాలను సేకరించగా, వాటిలో 1,63,065 నమూనాల నాణ్యత పరీక్షలు పూర్తిచేసి ఎటువంటి కలుషిత కారకాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఆ వనరుల్లో నీటిని తాగునీటిగా ఉపయోగించుకోవడానికి అనుమతించినట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 12 ల్యాబ్‌లకు కొత్తగా నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కొలాబరేషన్‌ సర్టిఫికెట్‌ పొందినట్టు చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top