
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు.
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్‌లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె.
‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.
అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు..
పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె.
జరిగింది ఏంటంటే..
జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే..
కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
