
వారం రోజులు సెలవులో ఉన్నానని పోస్టుమేన్ చేత రాయిస్తారా?
లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐ మోహన్‌పై హైకోర్టు మండిపాటు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా, లక్కిరెడ్డిపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌పై హైకోర్టు మండిపడింది. మోహన్ తాము జారీ చేసిన నోటీసులను తీసుకోకుండా ఉండేందుకు, వారం రోజులుగా తాను సెలవులో ఉన్నట్లు పోస్టుమేన్ చేత రాయించారని హైకోర్టు అభిప్రాయపడింది. ఎస్‌ఐ చెప్పకుంటే హైకోర్టు నోటీసుల విషయంలో ఓ పోస్టుమెన్‌కు ఇలా రాసేంత ధైర్యం ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది. మనదేశంలో ఏ పోస్టుమేన్ కూడా ఇలా రాసే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. వరుసగా ఏడు రోజులపాటు మోహన్ సెలవులో ఉన్నారని పోస్టుమేన్ రాసిన నేపథ్యంలో, అవసరమైతే పోలీస్‌స్టేషన్ నుంచి హాజరుపట్టీ తెప్పించి పరిశీలిస్తామని తెలిపింది. ఎస్‌ఐ తాను చాలా తెలివైన వ్యక్తినని భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది.
ఏడు రోజుల పాటు ఎస్‌ఐ వరుసగా విధులకు హాజరు కాలేదంటే నమ్మలేకున్నామని పేర్కొంది. మరో అవకాశం ఇస్తున్నామని, నోటీసులు తీసుకోవాలని, లేకుంటే తాము విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎస్‌ఐ మోహన్ కౌంటర్ దాఖలు చేశారా? లేదా? అన్న దాంతో సంబంధం లేకుండా విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాల సమర్పణకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జల్లా సుదర్శన్‌రెడ్డి నిర్బంధంపై పిటిషన్..
తన భర్త, ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మాజీ ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అందువల్ల అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జల్లా అరుణ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ మోహన్‌పై పలు ఆరోపణలు చేశారు. తన భర్త చొక్కా పట్టుకుని లాక్కెళ్లారని అరుణ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కొండారెడ్డి, మోహన్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా సోమవారం విచారణ సందర్భంగా ఎస్‌ఐ మోహన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.