breaking news
lakkireddypalli
-
మేమిచ్చిన నోటీసులే తీసుకోరా..?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా, లక్కిరెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మోహన్‌పై హైకోర్టు మండిపడింది. మోహన్ తాము జారీ చేసిన నోటీసులను తీసుకోకుండా ఉండేందుకు, వారం రోజులుగా తాను సెలవులో ఉన్నట్లు పోస్టుమేన్ చేత రాయించారని హైకోర్టు అభిప్రాయపడింది. ఎస్ఐ చెప్పకుంటే హైకోర్టు నోటీసుల విషయంలో ఓ పోస్టుమెన్‌కు ఇలా రాసేంత ధైర్యం ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది. మనదేశంలో ఏ పోస్టుమేన్ కూడా ఇలా రాసే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. వరుసగా ఏడు రోజులపాటు మోహన్ సెలవులో ఉన్నారని పోస్టుమేన్ రాసిన నేపథ్యంలో, అవసరమైతే పోలీస్‌స్టేషన్ నుంచి హాజరుపట్టీ తెప్పించి పరిశీలిస్తామని తెలిపింది. ఎస్ఐ తాను చాలా తెలివైన వ్యక్తినని భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది.ఏడు రోజుల పాటు ఎస్ఐ వరుసగా విధులకు హాజరు కాలేదంటే నమ్మలేకున్నామని పేర్కొంది. మరో అవకాశం ఇస్తున్నామని, నోటీసులు తీసుకోవాలని, లేకుంటే తాము విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎస్ఐ మోహన్ కౌంటర్ దాఖలు చేశారా? లేదా? అన్న దాంతో సంబంధం లేకుండా విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాల సమర్పణకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.జల్లా సుదర్శన్‌రెడ్డి నిర్బంధంపై పిటిషన్..తన భర్త, ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మాజీ ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అందువల్ల అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జల్లా అరుణ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి, ఎస్ఐ మోహన్‌పై పలు ఆరోపణలు చేశారు. తన భర్త చొక్కా పట్టుకుని లాక్కెళ్లారని అరుణ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కొండారెడ్డి, మోహన్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా సోమవారం విచారణ సందర్భంగా ఎస్ఐ మోహన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
పాలవ్యాన్ ఢీకొని విద్యార్థికి గాయాలు
లక్కిరెడ్డిపల్లె: స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఓ విద్యార్థి ని పాలవ్యాను ఢీకొంది. శనివారం ఉదయం లక్కిరెడ్డిపల్లె గంగమ్మ ఆలయం వద్ద జరిగిన ఈ సంఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. లక్కిరెడ్డిపల్లెలోని విశ్వభారతి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చింతల సందీప్ శనివారం ఉదయం పాఠశాలలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సందీప్ ను కడప రిమ్స్ కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పాలవ్యాన్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రెండు బైకులు ఢీ: నలుగురికి గాయాలు
లక్కిరెడ్డిపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని లక్కిరెడ్డి పల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో ఎదురుగా వస్తున్న సుమోను తప్పించబోయి ఓ బైకు మరో బైకును ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు రామాపురం మండలం నీలకంఠపురం వాసులని పోలీసులు తెలిపారు. -
మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి మృతి
తిరుపతి: మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజగోపాల్ రెడ్డి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.