సీజన్‌ వచ్చినా సీడ్‌ ఏది? | Andhra Pradesh govt focuses on seed distribution | Sakshi
Sakshi News home page

సీజన్‌ వచ్చినా సీడ్‌ ఏది?

Jun 21 2025 5:54 AM | Updated on Jun 21 2025 5:54 AM

Andhra Pradesh govt focuses on seed distribution

బదిలీలలో అధికారులు బిజిబిజీ

పంపిణీపై దృష్టిపెట్టని ప్రభుత్వం

జిల్లాల్లో 3 లక్షల క్వింటాళ్ల విత్తనం

ఇప్పటికి 82 వేల క్వింటాళ్లే అమ్మకం

డి క్రిష్‌ యాప్‌ ద్వారా పంపిణీ

నాణ్యతపైనా రైతుల్లో సందేహాలు

రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అందరూ బదిలీల్లో తలమునకలయ్యారు. నచ్చినచోట ఉద్యోగం పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది బదిలీలకు కూడా పచ్చజెండా ఊపారు. దీంతో రైతు సేవా కేంద్రాల సిబ్బంది సైతం బదిలీల కోసం నానా తంటాలు పడుతున్నారు.

మే 15న మొదలైన ఈ ప్రక్రియ నెల రోజులు దాటినా కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. అందరూ పైరవీల కోసం తిరుగుతుండడంతో స్థానికంగా ఎవరూ అందుబాటులో లేరు. దీంతో రైతులకు విత్తనాలు అందడం లేదు. మరోపక్క డి క్రిష్‌ యాప్‌ కూడా అనుకున్నంతగా పనిచేయడం లేదు. సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్‌లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.     – సాక్షి, అమరావతి

నైరుతి రుతుపవనాలు ప్రవేశించి ఇరవై రోజులవుతోంది..! ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై పక్షం రోజులు దాటింది..! కానీ, అన్నదాతల చేతికి ఇంకా విత్తనం అందలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యంతో సబ్సిడీ విత్తన పంపిణీ ఊపందుకోలేదు. ఇప్పటికే సరఫరాలో అడ్డగోలుగా కోతలు పెట్టిన ప్రభుత్వం కనీసం అదునుకు విత్తనం అందించడంలో కూడా విఫలమవుతోంది. కొన్నిచోట్ల డిమాండ్‌కు సరిపడా విత్తనం కరువు లేదు. మరికొన్నిచోట్ల సిబ్బందే అందుబాటులో లేరు. ఇంకొన్నిచోట్ల డీ క్రిష్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలు... అంతా రైతులకు తలనొప్పిగా మారింది. అస్తవ్యస్తంగా సాగుతున్న అధికారుల బదిలీల ప్రక్రియ ఖరీఫ్‌కు సన్నద్ధమైన రైతులకు ప్రతిబంధకంగా మారింది.

నాణ్యత ప్రశ్నార్థకమే...!
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సబ్సిడీ విత్తనంతో పాటు నాన్‌ సబ్సిడీ విత్తనాన్ని కూడా వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లలో ధ్రువీకరించిన తర్వాతే మార్కెట్‌లో మ్మకానికి అనుమతిచ్చేవారు. కానీ, ప్రస్తుతం అధికారులంతా బదిలీల్లో తలనమునకలు కావడంతో నాణ్యతను పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు చాపకింద నీరులా పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న నకిలీ విత్తనాలను కట్టడి చేయడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.

⇒  ఏ అనుమతి లేని కంపెనీలు వివిధ పేర్లతో రాష్ట్రంలో మార్కెటింగ్‌ చేస్తున్నాయని చెబుతున్నారు. మిర్చి విత్తనాల ధర కిలో రూ.వేలల్లో ఉండడం, కొన్ని కంపెనీల విత్తనాలు రూ.లక్షకు పైగా పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో రైతులు కోరుకున్న రకం లభ్యత తక్కువగా ఉందని ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

⇒  ఏ కంపెనీ ఎంత పరిమాణంలో ఏ వ్యాపారికి విత్తనం సరఫరా చేస్తున్నదన్న కచ్చితమైన లెక్కలు వ్యవసాయ శాఖ వద్ద లేకపోవడం కూడా అక్రమాలకు కారణమవుతోంది.

లక్ష క్వింటాళ్ల కోత..
జిల్లాలకు అడ్డగోలుగా సబ్సిడీ విత్తనం కోత పెట్టారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరమవగా దాదాపు లక్ష క్వింటాళ్ల కోత పెట్టారు.  5.38 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం పంపిణీకి అనుమతివ్వగా, 3 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. జూన్‌ 17 నాటికి లక్షన్నర మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 82 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేశారు. ఏప్రిల్, మేలో పూర్తి చేయాల్సిన పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జూన్‌ మూడో వారం వచ్చినా కొనసాగుతూనే ఉంది. 80 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనం అవసరం కాగా, 64,324 క్వింటాళ్లకు పరిమితం చేశారు. ఇందులో కూడా 36,817 క్వింటాళ్లు పొజిషన్‌ చేయగా, 22,139 క్వింటాళ్లే పంపిణీ చేశారు.

ఇండెంట్‌ ప్రకారం 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అవసరమైతే 2.10 లక్షల క్వింటాళ్లకు తగ్గించారు. ఇందులోనూ 1.38 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పొజిషన్‌ చేశామని చెబుతుండగా, ఇప్పటికి 45,449 క్వింటాళ్లే సరఫరా చేయగలిగారు. 2.28 లక్షల క్వింటాళ్ల వరి విత్తనం కావాల్సి ఉండగా.., 1.27 లక్షల క్వింటాళ్లు పొజిషన్‌ చేశామంటున్నారు. 15,560 క్వింటాళ్లనే సరఫరా చేయగలిగారు. పచ్చి రొట్ట, వేరుశనగ, వరి మినహా మిగిలిన పంటల సబ్సిడీ విత్తనం క్వింటాలు కూడా పొజిషన్‌ చేయని పరిస్థితి నెలకొంది. అదనపు విత్తనాల కోసం జిల్లాల వారీగా పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. సీజన్‌ ఊపందుకుంటే విత్తనం కోసం రైతులు పడే ఇబ్బందులు మరింత పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement