మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Andhra Pradesh Government Support for Mango Farmers - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మామిడికి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న దానికంటే ఎక్కువ ధర చిత్తూరు జిల్లాలోని రైతులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మామిడికి మార్కెట్‌లో రేటు తగ్గుతోందని తెలియగానే సీఎం జగన్‌ జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దింపి మామిడి ధరలను స్థిరీకరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘చిత్తూరు జిల్లాలో మామిడిపై ఈ జిల్లా వ్యక్తిగా చంద్రబాబుకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. అయినా వాస్తవాలను వక్రీకరిస్తూ, ప్రభుత్వంపై ఏదో రకంగా బురద చల్లాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలోని మామిడి రైతుల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..

ఆ రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి
కర్ణాటకలోని శ్రీనివాసపురం, తమిళనాడులోని కృష్ణగిరి మార్కెట్లలోకి తక్కువగా మామిడి వస్తే.. అక్కడి వ్యాపారులు చిత్తూరు జిల్లాకు వచ్చి మన రైతుల నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లా కన్నా తక్కువ రేట్లు ఉన్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌తో కలిపి కిలో రూ.7కు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో రైతులు ఒకేసారి కోతలు ప్రారంభించారు. అవసరానికి మించి ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం వల్ల కూడా కొంతమేర రేటు తగ్గింది. రైతుల గురించి ఎంతగానో ఆలోచించే సీఎం జగన్‌ ఇప్పటికే మ్యాంగో బోర్డు ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయించి, కేంద్రానికి పంపారు. మామిడి ధరలు పడిపోతున్నాయనే సమాచారం రాగానే మార్కెటింగ్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్‌ నాలుగైదు సార్లు పల్ప్‌ ఉత్పత్తిదారులు, రైతులతో సమావేశాలు నిర్వహించారు. కేజీ రూ.11కు కొనుగోలు చేసేలా ఒప్పించారు. చిత్తూరు నుంచి పంట రాకముందే కృష్ణా జిల్లా నుంచి వచ్చేది. అక్కడ కొనుగోళ్లు పూర్తయిన తరువాత చిత్తూరు ప్రాంతంలో పంట వచ్చేది. కృష్ణా జిల్లాలో కేజీ ధర రూ.9 వద్ద ప్రారంభమై రూ.4కు పడిపోయింది. చిత్తూరులో కూడా అలాగే  రూ.9 రూపాయల వద్ద ఉంది. 

90 శాతం ఫ్యాక్టరీలు చంద్రబాబు బంధువులు, మద్దతుదారులవే
చిత్తూరు జిల్లాలో 9 శాతం మామిడి పల్ప్‌ ఫ్యాక్టరీలు చంద్రబాబు బంధువులు, వారి పార్టీ మద్దతుదారులకు చెందినవే. ఈ ఫ్యాక్టరీలు సిండికేట్‌ అయి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని గతంలో అనేక సార్లు మేం చెప్పాం. కనీసం మా ప్రాంతంలోని రైతులకైనా అండగా నిలవాలన్న ఉద్దేశంతో సొంత ఫ్యాక్టరీని ప్రారంభించాం. సింగిల్‌ లైన్‌లో 3 వేల నుంచి 4 వేల టన్నులు మాత్రమే ఈ ఫ్యాక్టరీ ద్వారా మేం పల్ప్‌ ఉత్పత్తి చేయగలుగుతాం. మాకు, మా కుటుంబ సభ్యులకు ఉన్న సొంత తోటల నుంచి వచ్చే మామిడి మా ఫ్యాక్టరీకి 70% వరకు సరిపోతుంది. బయట నుంచి మరో 20 నుంచి 30 శాతం కొనుగోలు చేస్తాం. ఇంత తక్కువ సామర్థ్యం ఉన్న మా ఫ్యాక్టరీ ద్వారా మేం మామిడి ధరను నియంత్రిస్తున్నామని చంద్రబాబు చెప్పడం దారుణం. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఆ ఫ్యాక్టరీల గురించి, రైతులు పడుతున్న ఇబ్బంది గురించి ఆయనెందుకు మాట్లాడటం లేదు. చంద్రబాబు తానా అంటే సీపీఐ నారాయణ తందానా అంటున్నారు. వారిద్దరూ కూడబలుక్కుని అసత్య ప్రచారం చేస్తున్నారు. 

‘వైఎస్‌ వల్లే ప్రాజెక్టులొచ్చాయని కేసీఆరే అన్నారు’
విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి బదులిస్తూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గురించి స్వయంగా కేసీఆర్‌ ఏం మాట్లాడారో అందరూ గమనించాలన్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు మేలు చేశారని, ఆయన వల్లే తెలంగాణకు ఇన్ని ప్రాజెక్ట్‌లు వచ్చాయని కేసీఆర్‌ ప్రశంసించారని గుర్తు చేశారు. రాయలసీమకు తాగు, సాగునీటిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మించడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఏపీకి ఎన్ని టీఎంసీలు కేటాయించారో వాటిని మాత్రమే తీసుకుంటామని, ఇందులో తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. రాయలసీమకు నీరివ్వాలని గతంలో కేసీఆర్‌ సూచించారని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణకు నష్టం చేకూర్చే పనులను ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ చేయదని, ఇందుకు సీఎం జగన్‌ కూడా అంగీకరించరని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top