తెలంగాణ సరిహద్దులో శ్రీరామనవమి.. అదిగో భద్రాద్రి.. ఎటపాక ఇదిగో.. | All Arrangements Ready For Sri Rama Navami Celebrations At Yetapaka | Sakshi
Sakshi News home page

తెలంగాణ సరిహద్దులో శ్రీరామనవమి.. అదిగో భద్రాద్రి.. ఎటపాక ఇదిగో..

Apr 9 2022 11:24 AM | Updated on Apr 9 2022 11:32 AM

All Arrangements Ready For Sri Rama Navami Celebrations At Yetapaka - Sakshi

విద్యుత్‌ కాంతుల్లో భద్రాద్రి రామాలయం

సాక్షి, ఎటపాక: సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సరిహద్దున ఉన్న ఎటపాక మండలంలో జటాయువు మండపం, గుండాల గ్రామంలోని ఉష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావిని భక్తుల దర్శనార్థం సిద్ధం చేశారు.  ఏటా భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం,ముక్కోటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు జటాయువు మండపం,ఉష్ణగుండాలను దర్శించుకుంటారు. ఈనెల 10న శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం, 11న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాలకు భద్రాచలంలోని  రామాలయంలో నిర్వహించేందుకు  దేవస్థానం అధికారులు  అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిగో భద్రాద్రి..గౌతమి అదిగో చూడండి... అంటూ శ్రీరామదాసు పిలుపునందుకుని సీతారాముల కల్యాణానికి భక్తులు తరలివస్తున్నారు.

శ్రీరామనవమి అంటే చాలు భక్తిపారవశ్యంతో పులకించే భక్తులు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే  వేలాది మంది  భద్రాద్రికి  ఏటా వస్తుంటారు. అంతేకాకుండా రామయ్య పెళ్లి వేడుకల్లో అన్నీ తామై ముందుంటారు.  తలంబ్రాల తయారీ, పెళ్లి తంతులో ఉపయోగించే కొబ్బరి బొండాలు భద్రాద్రి  సీతారాముల కల్యాణానికి భక్తులు ఉభయగోదావరి జిల్లాల నుంచే తీసుకెళుతుంటారు. కరోన కారణంగా స్వామి వారి కల్యాణాన్ని గత రెండేళ్లుగా వీక్షించే భాగ్యాన్ని భక్తులు నోచుకోలేదు.అయితే ఈఏడాది జరిగే వేడుకలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో పాల్గొనేందుకు   లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియాన్ని సుందరంగ అలంకరించారు. పట్టణంలోని ప్రధానకూడల్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.   


ఉçష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావి 

ఉష్ణగుండాల ప్రాశస్త్యం 
సీతమ్మ వారు వనవాస సమయంలో గోదావరిలో స్నానమాచరించే క్రమంలో చన్నీళ్లు పోసుకునేందుకు కొంత అసౌకర్యానికి గురైనట్టు చరిత్ర. ఆ సమయంలో లక్ష్మణుడు తన విల్లంబును ఇసుక తిన్నెల్లో ఎక్కుపెట్టి సంధించగా అక్కడ వేడి నీళ్లు వచ్చాయని ప్రతీతి. ఆ ప్రాంతంలోని గోదావరి ఇసుక తిన్నెల్లో బావి తీస్తే ఇప్పడు కూడా వేడి నీళ్లు వస్తుంటాయి. ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేడినీటిని తలపై చల్లుకుంటారు.

జటాయువు విశిష్టత
సీతారాముల వనవాస సమయంలో సీతమ్మ వారు పర్ణశాల కుటీరంలోనే తలదాచుకున్నారు. రావణాసురుడు ఇక్కడనే సీతమ్మ వారిని అపహరించారు. ఆకాశ మార్గాన ఎత్తుకెళ్తున్న సమయంలో జటాయువు అనే పక్షి రావణాసురున్ని నిలువరించేందుకు భీకర పోరాటం చేసిన క్రమంలో రెక్క ఒకటి తెగి పడిన ప్రదేశమే ఎటపాక. మొదట్లో జటాయుపాక, ఆ తరువాత జటపాక, కాలక్రమంలో ఎటపాకగా రూపాంతరం చెందింది. పక్షి కాలుపడిన గుర్తులు నేటికీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. చిన్నపాటి మండపాన్ని గ్రామస్తులే నిర్మించారు.

యోగరాముడు (శ్రీరామగిరి క్షేత్రం)
ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రదేశం. నిండుగా ప్రవహించే గోదావరి నదీతీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం. ఆ కొండకే శ్రీరామగిరి అని పేరు. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించినట్టు స్థలపురాణం చెబుతోంది. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం (వనక్షేత్రం) చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెదుకుతూ ఈప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని తెలుస్తోంది. ఆ శబరి మాత పేరుతోనే ఇక్కడి నదిని శబరి నది అంటారు. సబరియే నదిగా మారిపోయిందనే కథ కూడా ఉంది. ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహితసంబంధం గల పవిత్రప్రాంతమిది.

ఈప్రాంతానికి సమీపంలో రేఖ పల్లిలో (రెక్కపల్లి)(జటాయువు యొక్క రెండవ రెక్క పడిపోయిన చోటు) రెక్కను చూసి జటాయువును చూశారు. రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలుచేశారు.  గోదావరి తీరంలో ఓపెద్ద శిలపై దానికి పిండ ప్రదానం చేసినట్టు స్థల చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ శిలను మనం దర్శించవచ్చు.  ముందు ఈ కొండపై రామలక్ష్మణుల రెండు విగ్రహాలే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో మాతంగి మహర్షి వంశీయులైన మహర్షులు సీతమ్మ తల్లివారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు స్థల చరిత్ర చెబుతోంది.  ఇక్కడి స్వామిని సేవించిన వారికి అన్ని రకాల మానసిక చింతలు తొలగి ధైర్య స్థైర్యాలు, స్థితి ప్రజ్ఞత ఏర్పడతాయని పెద్దలు చెబుతుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement