జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఈసారి గడ్డు పరిస్థితులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎల్‌–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోతే ఆ ప్రభావం ఆయకట్ | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఈసారి గడ్డు పరిస్థితులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎల్‌–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోతే ఆ ప్రభావం ఆయకట్

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

అనంతపురం సెంట్రల్‌: జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర హైలెవెల్‌ కెనాల్‌ (హెచ్చెల్సీ). దశాబ్దాలుగా సాగు– తాగునీటి అవసరాలు తీరుస్తున్న అతిపెద్ద వనరు. కర్ణాటక రాష్ట్రం హొస్పేటలోని తుంగభద్ర జలాశయం నుంచి గ్రావిటీ (హెచ్చెల్సీ) ద్వారా జిల్లాకు నీరందుతోంది. ఏటా సగటున దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీటిని కూడా అందిస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి 32 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఏటా జలాశయంలోకి వచ్చే నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి దామాషా ప్రకారం కేటాయింపులు చేస్తారు. 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు అందిస్తున్నారు. ఈ నీటితో దాదాపు 40వేల ఎకరాల్లో వరి, 80 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా పీఏబీఆర్‌ కుడి కాలువ కింద 48 చెరువులు, హెచ్చెల్సీ కింద లోకలైజేషన్‌ చెరువులకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీని వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగి రైతులకు, ప్రజలకు సాగు–తాగు నీటికి ఇబ్బందులు రాకుండా తుంగభద్ర జలాశయం ఆదుకుంటోంది.

ఎల్‌–నినోతో తీవ్ర వర్షాభావం

ఈ ఏడాది ఎల్‌–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగానే ఉంటాయని శాస్త్రవేత్తలు ముందే వెల్లడించారు. కర్ణాటకలో తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు రాలేదు. అనంతపురం జిల్లాలోనే కాస్తోకూస్తో ఇప్పటి వరకూ వర్షాలు పడ్డాయి. కర్ణాటకలో ఆ పరిస్థితి కూడా లేనట్లు కనిపిస్తోంది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నేటికీ అరకొర నీటితోనే దర్శనమిస్తోంది. ఏటా మే, జూన్‌ నెలల నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. దీంతో ప్రతి జూన్‌ మొదటి వారంలో తుంగభద్ర బోర్డు సమావేశం నిర్వహించి జలాశయానికి నీటి లభ్యత, కేటాయింపులు, నీటి విడుదల తేదీలను నిర్ణయిస్తారు. కానీ ఈసారి జరిగిన బోర్డు సమావేశంలో అలాంటి నిర్ణయాలేవీ లేకుండానే ముగించారు. కారణం జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడమే. రెండేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలతో తుంగభద్ర జలాశయం గేటు ఒకటి కొట్టుకుపోయింది. ఈ ఏడాది దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో నూతన గేటు ఏర్పాటు చేశారు. ఈ పనులు చేపట్టేందు కోసం జలాశయంలోని నీటిని మొత్తం ఖాళీ చేశారు. ప్రస్తుతం 480 క్యూసెక్కుల కనిష్ట ఇన్‌ఫ్లోతో జలాశయంలో 9.741 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 51,261 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లోతో 38.608 టీఎంసీల నీటి నిల్వ ఉండేది.

ఆయకట్టుపై తీవ్ర ప్రభావం

ఈసారి వర్షాలు పెద్దగా లేకపోవడంతో హెచ్చెల్సీ ఆయకట్టు తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లాలో రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర జలాలపై ఆధారపడే ఈ ప్రాంత రైతులు పంటలు సాగు చేస్తారు. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై తొలుత అధికారుల్లోనే ఆందోళన మొదలైంది. ఇక రైతుల పరిస్థితి భవిష్యత్‌లో కురిసే వర్షాలను బట్టి తెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తొందరపడి నార్లు పోసుకోవద్దు

తుంగభద్ర జలాశయానికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్‌ఫ్లో లేదు. దీని వల్ల ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. ఎల్‌–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నా... మరికొద్దిరోజులు వేచిచూస్తే తప్ప అంచనాలు వేయలేం. అదృష్టవశాత్తు పెద్ద వర్షాలు వస్తే తుంగభద్ర జలాశయంలో 40 టీఎంసీలకు చేరుకున్న తర్వాత నీటిని విడుదల చేస్తారు. హెచ్చెల్సీ (కాలువ) ఆధునికీకరణ పనులు, షట్టర్ల ఏర్పాటు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తొందరపడి నార్లు పోసుకోవడం లాంటివి చేయవద్దు. నీటి లభ్యతను బట్టి తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చెల్సీకి కేటాయింపులు, నీటి విడుదల తేదీలను ప్రకటిస్తారు.

– సుధాకర్‌రావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ

ఎల్‌–నినో ఎఫెక్ట్‌..

నేటికీ కనిష్టస్థాయిలోనే నీటి మట్టం

ప్రస్తుతం 480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

9.741 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ

గతేడాది 38.608 టీఎంసీల నీటి నిల్వ

జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement