రేపు రీ–నీట్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు రీ–నీట్‌

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

అనంతపురం అర్బన్‌: వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) రీ ఎగ్జామ్‌ను ఈ నెల 21న నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణకు స్థానిక అధికారులకు కాకుండా ప్రత్యేకంగా తన అధికారులను ఎన్‌టీఏ నియమించుకుంది. చివరకు బందోబస్తులోనూ కేంద్ర బలగాలను ఏర్పాటు చేసుకుంది. కేంద్రాల్లో ఎన్‌టీఏ ముద్ర ఉన్న గోడ గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదిరిగా స్థానిక అధికారులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. అంతా ఎన్‌టీఏ కంట్రోల్‌లో రీ–ఎగ్జామినేన్‌ జరగనుందని అధికారులు స్పష్టం చేశారు.

కలెక్టరేట్‌లో ‘రీ–నీట్‌’ కంట్రోల్‌ రూమ్‌

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) రీ– ఎగ్జామినేషన్‌ నిర్వహణ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సందేహాల నివృత్తి, అత్యవసర సహాయం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు, సంబంధిత సిబ్బంది టోల్‌ ఫ్రీ నంబర్‌ 85002 92992లో సంప్రదించాలని సూచించారు. కంట్రోల్‌ రూమ్‌ 20వ తేదీ ఉదయం 10 నుంచి 21వ తేదీ రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

‘సర్‌’ పర్యవేక్షక

అధికారుల నియామకం

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను ఎన్నికల కమిషన్‌ నియమించింది. అన్ని జిల్లాలకూ పర్యవేక్షక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ శుక్రవారం జారీ చేశారు. అనంతపురం జిల్లా పర్యవేక్షక అధికారిగా మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణ, గోదావరి కెనాళ్ల మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.క్రిస్ట్‌ కిషోర్‌కుమార్‌ను నియమించారు.

అదనపు ఎస్పీ బాధ్యతల స్వీకరణ

అనంతపురం సెంట్రల్‌: అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఎస్పీ జగదీష్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయన సుదీర్ఘకాలం పాటు కర్నూలు, కడప జిల్లాల్లో ఎస్‌ఐగా, సీఐ, డీఎస్పీగా ఇంటెలిజెన్స్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌, అవినీతి నిరోధక శాఖ విభాగాల్లో పనిచేశారు. ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతిపై అనంతపురానికి నియమితులయ్యారు.

విజిలెన్స్‌ ఏఎస్పీగా స్నేహిత

అనంతపురం సెంట్రల్‌: రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ ఏఎస్పీగా స్నేహిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో వెయిటింగ్‌లో ఉన్న ఆమెను ఇటీవల జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు విజిలెన్స్‌ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement