‘ రాష్ట్రంలో దళితులపై దమనకాండ’ | - | Sakshi
Sakshi News home page

‘ రాష్ట్రంలో దళితులపై దమనకాండ’

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దమన కాండ జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, రెడ్‌బుక్‌ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అండదండలతో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని విమర్శించారు. దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల హత్యలు జరుగుతుంటే కనీసం ఖండించలేని స్థితిలో ఉన్న హోం మంత్రి వంగలపూడి అనితకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చిన్న సంఘటన జరిగినా వీధులకెక్కి గొంతులు చించుకున్న టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెస్‌ రాజు.. ఇప్పుడు దళితులపై ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దళితుల హత్యలు, దాడుల ఘటనలపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సాకే రామాంజినేయులు, నాయకులు ప్రభుదాస్‌, నారాయణ స్వామి, విజయ్‌ కుమార్‌, సురేష్‌, సాకే అనిల్‌కుమార్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఐఆర్‌ హామీ అమలు చేయండి

అనంతపురం అర్బన్‌: ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి. అధికారంలోకి రాగానే ఐఆర్‌ ప్రకటిస్తామంటూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ ఎన్‌.దివాకర్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను నగరంలోని ఆయన స్వగృహంలో నాయకులు శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మూడేళ్లు గడుస్తున్నా పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించకపోవడంతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రకటిస్తామని చెప్పిన ఐఆర్‌ హామీ అమలు కాలేదన్నారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణం పీఆర్‌సీ కమిషన్‌ వేయాలని కోరారు. పీఆర్‌, ఐఆర్‌, డీఏ, తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాఽధికారి వి.పునీత్‌బాబు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డి.ప్రసాద్‌, ఏపీ జేసీ అమరావతి మహిళ విభాగం జిల్లా చైర్‌పర్సన్‌ బి.సురేఖరావు, ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి, 14వ బెటాలియన్‌ జిల్లా అధ్యక్షుడు టి.పెద్దయ్య, ఎస్‌ఎల్‌టీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.శివానందరెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, వాణిజ్య పన్నులశాఖ హరి, వీఆర్‌ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓబుళేసు, తదితరులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో జింకకు గాయాలు

నార్పల: మండల పరిధిలోని తుంపెర గ్రామ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి జింకపై కుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో రైతు సంజీవరాయుడు అప్రమత్తమై కుక్కల బారి నుండి జింకను కాపాడి అటవీశాఖ అధికారులుకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను అటవీశాఖ అధికారులు ఉషారాణి, తేజేశ్వర్‌రెడ్డి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డాక్టర్‌ సాయి సుప్రజ పర్యవేక్షణలో రాజారెడ్డి, ధనమ్మ, గురుప్రసాద్‌ చికిత్స చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement