● చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం
ఉరవకొండ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన అరాచకాలు, హత్యలు, దోపిడీలతోనే సాగిందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల విజయోత్సవ సభలు నిర్వహిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ కార్యక్రమం దిగ్విజయం అయిందన్నారు. దీంతో చంద్రబాబు సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగిందన్నారు. సభలకు వచ్చిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పకోలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో పూర్తి మద్దతిచ్చిన ఉద్యోగులు, అమరావతి రైతులు సైతం చంద్రబాబు పాలన అధ్వానంగా ఉందనడం చంద్రబాబు నికృష్ట పాలనకు నిదర్శనమన్నారు. మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం అభాసుపాలైందన్నారు.రైతులకు అందించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, రైతు ఆత్మహత్యల పరిహారాల చెల్లింపులు విషయాన్ని ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతాంగం నిరాశలో ఉన్నారన్నారు.
మద్దతు ధర కల్పించడంలో పయ్యావుల విఫలం
ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల ఉరవకొండ ప్రాంతంలో అధికంగా సాగయ్యే పప్పుశనగకు మద్దతు ధర కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కనీసం సబ్సిడీ విత్తనాలు ఇప్పించలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కంది రైతులు పంటను వందల కి.మీ వెళ్లి అమ్ముకోవాల్సిన దీనస్థితి నెలకొందని చెప్పారు. 16 లక్షల మంది కౌలు రైతులకు వరుసగా మూడోసారి సబ్సిడీ ఎరువులు అందజేయకుండా మొండి చేయి చూపారని మండిపడ్డారు. సాగునీటి అభివృద్ధి నిధులను చంద్రబాబు ప్రభుత్వం వేలాది కోట్లు వృథా చేసిందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న ‘సర్’లో వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలకు సహకారం అందించకూడదని వీఆర్‌ఓలకు కూటమి నేతలు ఆదేశాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి మాటలకు సహకరించి నిజమైన ఓటర్లను తొలగిస్తే వైఎస్సార్‌సీపీ పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధి కేవీ.రమణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తలూరి అశోక్, మండల సమన్వయకర్త ములగిరిపల్లి ఓబన్న, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు గందోడి మారేష్ తదితరులు పాల్గొన్నారు.


