బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో బాలాలయంలో శనివారం స్వామివారి ప్రతిష్టాపన జరగనుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో స్వామిని ప్రతిష్టిస్తున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి, ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్ చార్యులు, ధర్మకర్త శ్రీనాథ్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని భోజనశాలలో శనివారం ఉదయం 7.37 గంటల నుంచి 11.17 గంటలకు బాలాలయాన్ని ఏర్పాటు చేసి, స్వామివారిని ప్రతిష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడే నిత్య పూజలు, అర్చనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నుట్లు తెలియజేశారు. ఆలయ జీర్ణోద్ధరణ పూర్తయ్యే వరకు భక్తులకు బాలాలయంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.
అప్పులోళ్ల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం
పెద్దపప్పూరు: అప్పుల వాళ్ల బెదిరింపులు తాళలేక పురుగుల మందుతాగి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన పెద్దపప్పూరు మండలంలోని పసలూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గురునాథ్, రాజేశ్వరి దంపతులు. గురువారం సాయంత్రం ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు గురునాథ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. అయితే పురుగుల మందు తాగి రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న రాజేశ్వరిని కొందరు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు చికిత్స నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల వాళ్లు బెదిరింపులకు దిగడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది.


