టీచర్ల విభజన కసరత్తు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

టీచర్ల విభజన కసరత్తు వేగవంతం

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లా విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఉపాధ్యాయులను అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు విభజించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని కేడర్ల ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తోంది.

డివిజన్ల వారీగా..

మొదటి రోజు అనంతపురం విద్యా డివిజన్‌ పరిధిలోని వివరాలను పరిశీలించిన అధికారులు, రెండో రోజు గురువారం గుత్తి డివిజన్‌కు చెందిన ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో అనంతపురం సైన్స్‌ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. సీనియార్టీ జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రతి పేరును పరిశీలిస్తూ ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టారు. ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు, గుత్తి డీవైఈఓ లక్ష్మన్న, డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఐటీ విభాగం అధికారులు పాల్గొని సీనియార్టీ జాబితాల పరిశీలన చేపట్టారు. శుక్రవారం, శనివారం శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహించి సీనియార్టీ జాబితాలు, ఖాళీల వివరాలను ఖరారు చేయనున్నారు.

కేడర్‌లో చేరిన తేదీనే ప్రాతిపదిక

ప్రస్తుతం ఉపాధ్యాయుడు ఉన్న కేటగిరీలో సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేపట్టను న్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను యూనిట్‌గా తీసుకుని ప్రక్రియ చేపడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు సంబంధించి వారు ఇక్కడ విధుల్లో చేరిన తేదీ నుంచే సీనియార్టీ లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ఉపాధ్యాయుల స్థానాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సస్పెన్షన్‌లో ఉన్నవారు, అనధికారంగా గైర్హాజరైన ఉపాధ్యాయుల పేర్లను కూడా సీనియార్టీ జాబితాల్లో చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విభజన ప్రక్రియలో ముందుగా వారిని ఏదో ఒక జిల్లాకు కేటాయించి, అనంతరం క్రమశిక్షణ చర్యలు కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు.

100 శాతం ఆప్షన్లు తప్పనిసరి

జిల్లా విభజన ప్రక్రియలో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆప్షన్లు, సీనియార్టీ, ఖాళీల ఆధారంగా తుది కేటాయింపులు చేపట్టే అవ కాశం ఉంది. జిల్లా విభజనతో తమ సేవా ప్రాంతం మారుతుందా.. సీనియార్టీపై ప్రభావం ఉంటుందా? అనే అంశాలపై ఉపాధ్యాయుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement