● ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 147 కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ప్రథమ సంవత్సరంలో కేవలం 34 శాతం, ద్వితీయ సంవత్సరంలో 51 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కొన్ని యాజమాన్యాలు ఆశించిన ఫలితాలు సాధించగా, మరికొన్ని జిల్లా సగటును కూడా అందుకోలేకపోయాయి. జిల్లాలో 23 ప్రభుత్వ కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరంలో 1,265 మంది పరీక్షలకు హాజరుకాగా 450 మంది (35.57 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,042 మందిలో 540 మంది (51.82 శాతం )ఉత్తీర్ణత సాధించారు. రెండు ఎయిడెడ్ కళాశాలల ఫలితాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.ప్రథమ సంవత్సరంలో 398 మంది హాజరుకాగా కేవలం 88 మంది మాత్రమే 22.11 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 50.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 48.64 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69.56 శాతం ఉత్తీర్ణత, 15 ఏపీ మోడల్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 31.89 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 53.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక 32 కేజీబీవీల్లో ప్రథమ సంవత్సరంలో 53.28 శాతం, ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. 66 ప్రైవేట్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 34.07 శాతం, ద్వితీయ సంవత్సరంలో 50.69 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పట్టపగలే కొల్లగొట్టారు!
యాడికి: మండలంలోని చందన గ్రామంలో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఇంట్లోకి చొరబడి కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్నాయి. చందన గ్రామానికి చెందిన తంగసాని పెద్ద యల్లారెడ్డి గురువారం ఉదయం తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసుకుని తాడిపత్రికి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి తిరిగొచ్చిన వారికి తాళం పగుల గొట్టి ఉండటం కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా, బీరువాలోని 36 తులాల బంగారు, రూ.4 లక్షల నగదు కనిపించలేదు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్‌తో వివరాలు సేకరించారు. బాధితుడు పెద్ద యల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచినట్లు సీఐ తెలిపారు.


