రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘హనీ ట్రాప్‌’ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ముఠా సభ్యులు ఈ వ్యవహారాన్ని నడుపుతుంటే పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ (స్పెషల్‌ బ్రాంచ్ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘హనీ ట్రాప్‌’ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ముఠా సభ్యులు ఈ వ్యవహారాన్ని నడుపుతుంటే పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ (స్పెషల్‌ బ్రాంచ్

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

రెండేళ్లుగా నడుస్తున్న హనీట్రాప్‌ను గుర్తించడంలో పోలీసులు విఫలం

ఎస్పీకి సమాచారం ఇవ్వడంలో ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ విభాగాలు ఘోర వైఫల్యం

బాధితులు స్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదులు చేసినా ఎస్‌బీ, ఇంటెలిజెన్స్‌ మౌనరాగం

హనీట్రాప్‌ వ్యవహారాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్న కొందరు పోలీసులు

టీడీపీ ఎమ్మెల్యేలకు తెలియకుండానే అనుచరులు దందా చేశారా అనే అనుమానాలు

టీడీపీ ఎమ్మెల్యేలు, కీలకనేతలపై విచారణ చేస్తేనే వెలుగులోకి మరిన్ని వాస్తవాలు

సాక్షిప్రతినిధి అనంతపురం: దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అనంతపురం ఒకటి. మొన్నటి వరకు దేశంలో వ్యభిచార ముఠాలపై ఎక్కడ రైడ్‌ చేసినా ‘అనంత’ యువతులు, మహిళలు ఉండేవారు. వీరికి కౌన్సిలింగ్‌ ఇచ్చి.. ఆ రొంపిలోకి తిరిగి వెళ్లకుండా నిరోధించేందుకు ఎన్నో స్వచ్ఛందసంస్థలు పని చేశాయి. ఇలాంటి దశ నుంచి ఇప్పుడిప్పుడే ‘అనంత’ అభివృద్ధిబాట పడుతోంది. కష్టపడి బతికే మనుషులున్న ప్రాంతం. పిల్లలను బాగా చదివించుకునేందుకు పట్టణాలకు పంపుతున్నారు. శని, ఆదివారాల్లో అనంతపురం మార్కెట్‌ యార్డు ప్రాంతాన్ని సందర్శిస్తే జిల్లావాసుల కష్టం, వారి జీవనశైలి కళ్లముందే కన్పిస్తుంది. యాపిల్‌తో సహా రాష్ట్రంలో అత్యంత ఎక్కువ పండ్ల ఉత్పత్తులు పండించే ప్రాంతం. ఇలాంటి జిల్లాలో ‘హనీ ట్రాప్‌’ ఉదంతం తీరు, దాని వెనుక టీడీపీ ముఠా సభ్యుల పాత్ర చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! ఒళ్లు అమ్ముకుని బతికే అభాగ్యులు ఒక రకం. కానీ అమ్మాయిల అందాలతో వలపు వల వేసి.. అందులో చిక్కుకున్న వారిని చితకబాది వీడియోలు తీసి లక్షల రూపాయలకు ప్రామిసరీ నోట్లు రాయించుకుని, వేధించడం, చివరకు వారి ప్రాణాలు పోయే స్థితికి తీసుకురావడం అనేది క్షమించరాని నేరంగా ‘అనంత’ సమాజం భావిస్తోంది.

ఎస్పీ చెప్పినా కేసు నమోదుకు నో!

జిల్లాలో ఎక్కడ నేరాలు జరిగినా పోలీసుల వ్యవహారశైలి ఎప్పటికప్పుడు గుర్తించి పోలీసుబాస్‌కు అందించడం ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ విధి. ఎస్పీ ఉన్న అనంతపురంలోనే 15 మందికిపైగా ఉన్న ముఠా సభ్యులు వందలాది మందిని ట్రాప్‌ చేస్తుంటే గుర్తించడంలో విఫలమయ్యారు. చివరకు ఓ పురోహితుడిని పూజ పేరుతో రప్పించి కొట్టి, వీడియోలు తీసి రూ.10 లక్షలు లాగేసి తిరిగి వేధింపులకు దిగితే బాధితుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లినా ఫలితం లేదు. చివరకు గతేడాది డిసెంబర్‌లో ఎస్పీ జగదీష్‌ను కలిసి విన్నవిస్తే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిఫార్సు చేసినా సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ కేసు నమోదు చేయలేదు. దీన్నిబట్టి పోలీసుశాఖ సిబ్బంది పనితీరు ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఊరికో సచివాలయం, కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, సీఐలు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా రెండేళ్లుగా జరుగుతున్న తంతును గుర్తించలేదు. కాదు..కాదు.. తెలిసినా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. ఎందుకంటే హనీట్రాప్‌ ముఠాలో పోలీసుల పాత్ర ఉండటంతో వారి గురించి ‘బాస్‌’కు చేరవేయకుండా తాత్సారం చేశారు. దీని ఫలితమే హనీ ట్రాప్‌ కుంభకోణం రూ.కోట్లకు చేరుకుంది. ముఠా వేధింపులు భరించలేక ఏకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది బాధితులు గోడు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి సిబ్బందితో శాంతి భద్రతలను ఎలా కాపాడతారో ఎస్పీకే తెలియాలి.

మేల్కోకుంటే ముప్పే

జిల్లాలో నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోతే శాంతిభద్రతలు దారితప్పే ప్రమాదం ఉంది. ఇద్దరు సీఐలు, ఆరుగురు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్న హనీట్రాప్‌ దందా వ్యవహారంలోనే ఎస్‌బీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎస్పీని అప్రమత్తం చేయలేకపోతే జిల్లాలో జరుగుతున్న నేరాల సమాచారం, ఎస్‌ఐ, సీఐల పనితీరుపై ఎలాంటి పారదర్శక నివేదికలు ఇస్తున్నారో ఎస్పీ గుర్తించాలి. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజకీయాల కోసం ఇలాంటి ఆసాంఘిక శక్తులను వెనకబెట్టుకోవడంపై ఆలోచించాలి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో వినిపించే ‘హనీ ట్రాప్‌’ పేరు ఇప్పుడు ‘అనంత’కు పాకింది. ప్రభుత్వ, రాజకీయ నేతల ఒత్తిళ్లతో కేసును సీరియస్‌గా తీసుకోకపోతే భవిష్యత్‌లో మరిన్ని దారుణాలకు ఇలాంటి ముఠాలు ఒడిగడతాయి. ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

దందా వెనుక ఎమ్మెల్యేల సపోర్ట్‌ లేదా?

బీజేపీ నుంచి లేడీ డాన్‌ రంగమ్మను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీలో చేర్చుకున్నారు. దబ్బర రాజేష్‌ అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, మాజీ మేయర్‌ మదమంచి స్వరూపకు అనుచరుడు. హనీట్రాప్‌ ముఠాతో సంబంధమున్న నరేంద్రరెడ్డి 2024 నుంచి దగ్గుపాటి ప్రసాద్‌ వెంట నడుస్తున్నారు. వీరు ఇంత అరాచకం చేస్తుంటే పరిటాల సునీత, దగ్గుపాటి ప్రసాద్‌ ఎందుకు తెలుసుకోలేకపోయారు.. రాప్తాడు మండలం హంపాపురంలోని 7 హిల్స్‌ హోటల్‌ వద్ద నిందితురాలితో కలిసి సీఐ శ్రీహర్ష పంచాయితీలు చేస్తుంటే ఎందుకు మిన్నకుండిపోయారు.. సునీత సోదరుడు ధర్మవరపు మురళీకి కూడా ఈ వ్యవహారం తెలీదా.. ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే పోలీసులు ఇంత ధైర్యంగా భాగస్వాములయ్యారా.. కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇంత నీచమైన మార్గం ఎంచుకోవాలా అనేది జిల్లావాసులు లేవనెత్తుతున్న ప్రశ్నలు. రెండేళ్లుగా ఈ గుట్టును గుర్తించకపోవడం కేవలం నిఘా వైఫల్యమే కాదు, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కూడా అనేది స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement