అనంతపురం సెంట్రల్: ‘ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు తారస్థాయికి చేరాయి. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. సత్యసాయి, శ్రీరామరెడ్డి తదితర తాగునీటి పథకాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులను తక్షణం పరిష్కరించాలి. బోర్లు ఎండిపోయిన పోయిన గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి’ అని సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనంతపురం కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పాల్గొన్నారు. ముగ్గురు మంత్రులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి.. తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. నిధుల లేమితో ఏ పనులూ ముందుకు సాగడం లేదు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వ స్థాయిలో చొరవ చూపి నిధులు తీసుకొస్తారని భావిస్తే వారు పత్తా లేకుండా పోయారని జెడ్పీటీసీలు, ఎంపీపీలు నిట్టూర్చారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఎలా..?
వేసవిలో తాగునీటి ఇబ్బందులు వస్తాయని తెలిసినా ముందస్తుగా పనులు చేపట్టకపోతే ఎలా అని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల వలన ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని పుట్టపర్తి ఎమ్మెల్యే సిందూరరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల నీటి తొట్టెలు నిర్మించినా అందులో నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా మారాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని, శనగ, వరి, మొక్కజొన్న పంటను సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.
రూ. వంద కోట్ల నిధులు తీసుకురండి
పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరగా.. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ స్పందిస్తూ నిధులు తీసుకురావాల్సిన మీరే అడిగితే ఎక్కడి నుంచి ఇవ్వాలని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారినికి రూ.100 కోట్ల నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. అలాగే సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 108 అంబులెన్స్ సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న యూజర్ చార్జీలు జెడ్పీ అందించడం ద్వారా సమస్యాత్మక ప్రాంతాలకు నిధులు మంజూరు చేయడానికి వీలవుతుందని వివరించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే విత్తనాలు రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు.
సమస్యలపై ఏకరువు
జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ నార్పల పీహెచ్‌సీలో గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కానింగ్ మిషన్ అందుబాటులో ఉన్నా ఉపయోగంలో లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కరించడానికి పీఏబీఆర్ నుంచి పైపులైన్ ఏర్పాటుకు నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 23 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, అవసరమైన చోట బోర్లు వేయాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక పిల్లలు బయటకు వెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేశ్వర్లు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ కేశవరెడ్డి, ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈఓ నాగరాజు నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
జెడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, చిత్రంలో కలెక్టర్ ఆనంద్, హాజరైన ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర, సభ్యులు
జిల్లాలో తాగునీటి సమస్య జఠిలం
ప్రభుత్వ తీరుపై జెడ్పీ సమావేశంలో సభ్యుల ధ్వజం
పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్
ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు


