సజావుగా పాలిసెట్‌ | - | Sakshi
Sakshi News home page

సజావుగా పాలిసెట్‌

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

అనంతపురం: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్‌ –2026 జిల్లాలో సజావుగా జరిగింది. మొత్తం 9,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 9,110 (93 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని పాలిసెట్‌ జిల్లా సమన్వయకర్త సి.జయచంద్రారెడ్డి తెలిపారు. అబ్బాయిలు 5,537 (94 శాతం), అమ్మాయిలు 3,553 (92శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు సత్యనారాయణరెడ్డి పర్యవేక్షించారు.

విపత్తుల నిర్వహణపై

మాక్‌ ఎక్సర్‌సైజ్‌

అనంతపురం అర్బన్‌: రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆయిల్‌, కెమికల్‌ మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు టేబుల్‌ టాప్‌ ఎక్సర్‌సైజ్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. విపత్తుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో 30న ఉదయం 8 గంటలకు గుత్తి మండలం పరిధిలో ఉన్న బీపీసీఎల్‌ ప్లాంట్‌లో మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇన్‌చార్జ్‌ జేడీఏ రవిపై 28న విచారణ

అనంతపురం అగ్రికల్చర్‌: వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్‌ ఏడీఏగా ఎం.రవి (ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ జేడీఏ) ఉన్న సమయంలో 2025 జూన్‌ 6న అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 28న విచారణ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యవసాయశాఖ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కమిషనరేట్‌కు చెందిన విచారణాధికారి (జేడీఏ) విజయభారతి నోటీసు జారీ చేసినట్లు సమాచారం. మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి.. ఏడీఏ రవి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఈ నెల 22, 23 తేదీల్లో విచారణ ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మరో ఉత్తరం ద్వారా సదరు అధికారి ఎం.రవి మీద చేసిన ఆరోపణలు సమాచార లోపం కారణమని తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోతుందని భావించారు. కానీ తాజాగా ఈ నెల 28న అనంతపురం, 29న హిందూపురంలో విచారణ కొనసాగుతుందని విచారణాధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో వ్యవసాయశాఖలో ఆధిపత్య పోరుపై వరుసగా విచారణలు కొనసాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాకినాడ టౌన్‌–మైసూర్‌ మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌

గుంతకల్లు: కాకినాడ టౌన్‌ నుంచి కర్ణాటకలోని మైసూర్‌కు కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టినట్లు డివిజన్‌ అధికారులు తెలిపారు. కాకినాడటౌన్‌ – మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌(17289)ను మే1 నుంచి పట్టాలెక్కుతుంది. కాకినాడ టౌన్‌ నుంచి ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూర్‌ జంక్షన్‌కు చేరుతుందున్నారు. తిరుగు ప్రయాణంలో మైసూర్‌ జంక్షన్‌ (17290) నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరంటౌన్‌, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నెలగొండ, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, యాదగిరి, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు, బెంగుళూరు సిటీ, కెంగేరి, రామనగరం, చెన్నపట్నం మండ్య మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు.

మే చివరి వరకు

ఉపాధి హామీ పథకమే

అనంతపురం టౌన్‌: ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉఫాధి హమీ పథకాన్ని వీబీ జీ రామ్‌ జీ పథకంగా పేరు మార్చి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఉపాధి కూలీల పనిదినాలను పెంచడంతో మే నెలాఖరు వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే కొనసాగుతుందని డ్వామా పీడీ సలీం బాషా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement