● పలు చోట్ల పెట్రోలు బంకులు మూత
● నో స్టాక్ బోర్డుతో వాహనదారుల బేజారు
కళ్యాణదుర్గం/ తాడిపత్రి టౌన్: అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కళ్యాణదుర్గంలో 8 పెట్రోల్ బంకులకు గాను ఆరు చోట్ల నోస్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో మిగిలిన రెండు బంకుల వద్దకు వాహనదారులు క్యూ కట్టారు. అయితే అక్కడ ఒక చోట పెట్రోల్ లేకపోతే.. మరొక చోట డీజిల్ లేదు. ఉదయం నుంచి వేచి ఉన్నా పెట్రోల్, డీజిల్ లభించకపోవడంతో వాహనదారులు మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాల నుంచి కోలుకోకముందే ఇప్పుడు ఇంధన కొరత ఏర్పడటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదని దుమ్మెత్తిపోశారు. ఇక తాడిపత్రి పట్టణ, చుట్టుపక్కల 20 పెట్రోలు బంకులు ఉండగా.. 12 బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. పెట్రోలు, డీజిల్ దొరక్కపోతే ఆటోలు ఎలా నడపాలి.. కుటుంబాలు ఎలా పోషించుకోవాలని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొందరు వాహనదారులు ముందు జాగ్రత్తగా అదనపు క్యాన్లతో క్యూలో నిల్చోవడం గమనార్హం. రాత్రికల్లా మిగిలిన బంకుల్లో కూడా ఇంధన నిల్వలు అయిపోయినట్లు తెలిసింది. ఇక అనంతపురంలో అర్ధరాత్రి వరకూ పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు కిక్కిరిసిపోయారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
అనంతపురం అర్బన్: జిల్లాలో డీజిల్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు. డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా చేయాలని సంబంధిత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్లకు తెలియజేశామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా స్టాక్ నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు తమ పరిధిలోని పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
కళ్యాణదుర్గంలోని నోస్టాక్ బోర్డుతో మూత
తాడిపత్రిలో క్యూ..
అనంతపురంలో పెట్రోలు బంకుల వద్ద శనివారం రాత్రి బారులు తీరిన ద్విచక్ర వాహనదారులు


