గుత్తి రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వలస కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజమ్‌ఘర్ జిల్లా ఫూల్‌పూర్ తాలూకా బెల్బాయి గ్రామానికి చెందిన అజయ్ సరోజ్ (23), అదే గ్రామానికి చెందిన మరికొందరితో కలసి గుత్తి మండలంతో పాటు నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలంలో మామిడి కాయల ప్యాకింగ్ పనికి వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామ శివారున ఉన్న తోటలో మామిడి కాయలు ప్యాకింగ్ చేసి లారీలో లోడు చేశారు. మధ్యాహ్న భోజనం కోసమని 44వ జాతీయ రహదారి దాటుతున్న అజయ్ సరోజ్‌ను కర్నూలు నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను తోటి కూలీలు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స మొదలు పెట్టే లోపు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అంతర్రాష్ట్ర గంజాయి విక్రేత అరెస్ట్
కూడేరు: గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కూడేరు పీఎస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ రాజు వెల్లడించారు. తాడిపత్రికి చెందిన గట్టు శివదత్త చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదనకు గంజాయిని కొనుగోలు చేసి కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి తరలించి ఎక్కువ మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ నేపథ్యంలో శనివారం గంజాయి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటిన్నర కిలోల గంజాయి, ఖరీదైన ఓ కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డీఎస్సీ వికలాంగుల కోటాలో అన్యాయం చేశారు
● విద్యాశాఖ తీరుపై దివ్యాంగులు అంజనప్ప, ప్రభావతి ఆవేదన
అనంతపురం టవర్‌క్లాక్: మెగా డీఎస్సీలో భాగంగా గత ఏడాది చేపట్టిన నియామక ప్రక్రియలో వికలాంగుల కోటా కింద అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారంటూ బాధితులు శ్రీసత్యసాయి జిల్లా ఓడీసీ మండలానికి చెందిన అంధుడు అంజనప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లు మండలానికి చెందిన ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అనంతపురంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో పనిచేసిన డీఈఓ ప్రసాద్, ఆర్‌జేడీ శ్యామూల్ ముడుపులు తీసుకుని తమకు తీరని అన్యాయం చేస్తూ ఎలాంటి అర్హత లేని శివలింగమ్మకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. స్థానికంగా ఆమెకు వైద్య పరీక్షలు చేయించకుండా వైఎస్సార్ కడప జిల్లాలో చేయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ను స్వయంగా సమస్య వివరించినా ఇప్పటి వరకూ వారూ కూడా స్పందించలేదని వాపోయారు. న్యాయం చేకూరే వరకు తాము పోరాటం చేస్తామని తెలిపారు.
క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య
రాప్తాడు రూరల్: క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం కొనకొండ్లకు చెందిన చాకలి భాగ్యమ్మ (34)కు రాప్తాడుకు చెందిన చాకలి నరేష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నరేష్ ఎలక్ట్రీషియన్‌గా, భాగ్యమ్మ బేల్దారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు నెలకొన్నాయి. శనివారం ఉదయం ఇద్దరూ పనుల కోసమని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికొచ్చారు. ఆ సమయంలో పిల్లలతో కలసి తాను ఊరికి వెళ్తానని వదిలిరావాలంటూ భర్తను భాగ్యమ్మ అడిగింది. అయితే తనకు ఓపిక లేదని, మీరే వెళ్లాలంటూ నరేష్ తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తల్లి గట్టిగా అరుస్తుంటే కుమారుడు ‘అమ్మా నువ్వు లోపలికి వెళ్లు’ అంటూ గదిలోకి పంపి తలుపులు వేశాడు. అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన భాగ్యమ్మ గది లోపలి నుంచి గడియపెట్టుకుని ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత తలుపులు తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో బలవంతంగా తలుపు తొలిగించి చూశారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భాగ్యమ్మను గమనించి వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


