ఆలయ కమిటీ నుంచి ‘హనీట్రాప్‌’ అనంత కుమారి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఆలయ కమిటీ నుంచి ‘హనీట్రాప్‌’ అనంత కుమారి తొలగింపు

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

అనంతపురం కల్చరల్‌: హనీట్రాప్‌ కేసులో పట్టుబడిన అనంతపురంలోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు అనంతకుమారిని కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ఈఓ నాగేంద్రుడు తెలిపారు. శనివారం మొదటిరోడ్డులోని శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్‌ నరేంద్ర చౌదరితో కలిసి ఆయన మాట్లాడారు. ఇకపై ఆలయానికి ఆమెకు ఎలాంటి సంబంధాలుండవని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

మలేరియా అంతమే లక్ష్యం

అనంతపురం: జిల్లాలో 2030 నాటికి మలేరియాను పూర్తి స్థాయిలో అంతం చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి ఓబులు తెలిపారు. నివారించదగిన వ్యాధులపై ప్రపంచ టీకాల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలను చైతన్య పరుస్తూ శనివారం అనంతపురంలో నర్సింగ్‌ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీని చేపట్టారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ర్యాలీని డాక్టర్‌ ఓబులు ప్రారంభించారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి మలేరియాను నిర్మూలించడంలో తమ వంతు బాధ్యత నెరవేరుస్తామంటూ విద్యార్థులతో కలిసి వైద్యాధికారులు ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్‌ ఓబులు మాట్లాడుతూ.. 2027 చివరి నాటికి మలేరియా జీరో కేసులే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, 2030 నాటికి పూర్తి స్థాయిలో అంతం చేస్తామని పేర్కొన్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణిస్తూ ప్రభుత్వ అన్ని శాఖల సహకారంతో ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపడతామన్నారు. జూన్‌ మాసమంతటా మలేరియా నివారణ మాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు. జిల్లా మాస్‌ మీడియా అధికారి నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మాత్రమే మలేరియా కేసులు నమోదు కావడం లేదన్నారు. ఇందులో అనంతపురం జిల్లాను చేర్చేలా కృషి చేయాలన్నారు. మాస్‌ మీడియా డిప్యూటీ అధికారి లక్ష్మీనారాయణ, హెచ్‌ఈఓ గంగాధర్‌, ఇన్‌చార్జ్‌ సహాయ మలేరియా అధికారి మద్దయ్య, అర్బన్‌ మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి అబ్దుల్‌ మునాఫ్‌, సిబ్బంది నూర్‌బాషా, శ్రీధర్‌ మూర్తి, రమేష్‌ బాబు, రాఘవేంద్రరెడ్డి, లోకేశ్వరరెడ్డి, మధుసూదన్‌, డిప్యూటీ హెచ్‌ఈఓ వెంకటేష్‌, ఆదిల్‌ బాషా, డెమో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు జూన్‌ 11 వరకు వేసవి సెలవులు పాటించాల్సినందేనని స్పష్టం చేశారు. ప్రత్యేక తరగతులు, స్పెషల్‌ కోచింగ్‌, రెమిడియల్‌ క్లాస్‌ల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు రప్పించడం పూర్తిగా నిషేధమన్నారు. అలాగే హోమ్‌వర్క్‌, ప్రాజెక్టులు, పరీక్షలు వంటి అకడమిక్‌ కార్యకలాపాలు అప్పగించరాదన్నారు. ఎలాంటి స్కాలర్‌షిప్‌ పరీక్షలూ నిర్వహించరాదన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలను విక్రయించరాదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మాత్రమే ఫీజులు వసూళ్లు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిలబస్‌కు అనుగుణంగా ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాలన్నారు. ఇతర పుస్తకాలను గుర్తిస్తే మాత్రం చర్యలుంటాయని హెచ్చరించారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు వారి పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించినా, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయించినా, అధికఫీజులు వసూళ్లు చేసినా సంబంధిత ఉప విధ్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement