శింగనమల: మండలంలోని నిదనవాడ సమీపంలో ఉన్న పెన్నానదీ పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తరలింపులపై శనివారం రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి పోలీసులు పరిశీలించారు. చెలరేగిన ఇసుక మాఫియా ఆగడాలను గత రెండు రోజులుగా రైతులు ఆడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శింగనమల, పెద్దవడుగూరు మండలాలకు చెందిన అధికారుల్లో చలనం వచ్చి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. పెన్నానది నట్టనడి మధ్య నుంచి ఇసుకను తవ్వి తరలించడంతో ఏర్పడిన లోతైన గుంతలను చూడగానే అధికారులు విస్తుపోయారు. భారీ స్థాయిలో ఇసుకను అక్రమంగా తరలించారని నిర్ధారించుకున్నారు.
అక్రమంగా పెన్నానదిలోకి చొరబడి..
పెద్దవడుగూరు మండలం చిత్రచేడు రెవెన్యూ పరిధిలోని పొలంలో ఇసుక రీచ్ కోసం అనుమతులను పొందిన చిత్రచేడు ప్రాంతానికి చెందిన కొందరు చివరకు పెన్నానదిలోకి అక్రమంగా చొరబడినట్లుగా అధికారులు గుర్తించారు. అటూఇటు చేస్తూ పెద్దవడుగూరు, శింగనమల మండలాల హద్దులను చెరిపేస్తూ శింగనమల మండలం నిదనవాడ సరిహద్దులోకి చొరబడి పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలించినట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను నిదనవాడ గ్రామానికి చెందిన పలువురు రైతులు నిలదీశారు. పలుమార్లు తాము వాహనాలను ఆడ్డుకుని అధికారులకు పట్టిస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
సరిహద్దులు గుర్తిస్తాం
ఇసుక తరలింపులతో భూగర్భ జలం అడుగంటి చుట్టుపక్కల ప్రాంతాల పొలాల్లోని బోరు బావుల్లో నీరు అందకుండా పోతోందని రైతులు వాపోయారు. నిదనవాడ రెవెన్యూ పరిధిలోని వంద ఎకరాల్లో పండ తోటలు ఉన్నాయని, నీటి తడులు అందక చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకపోతే, కలెక్టర్ వద్దకెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటామన్నారు. అప్పటికై నా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే అక్రమంగా ఇసుకను తరలించిన వారిపై తీసుకునే చర్యల గురించి అధికారులు ఏమాత్రం మాట్లాడకుండా నిదనవాడ, చిత్రచేడు గ్రామాల మధ్య ఉన్న రెవెన్యూ సరిహద్దులు గుర్తిస్తామని చెప్పడం విశేషం.
విస్తుపోయిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు
పెన్నానది నట్టనడిమధ్య నుంచి అక్రమ తరలింపు


