ప్రాణాలు బలిగొన్న ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి పట్టున ఉంటున్న వారు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి నీట మునిగారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి

గుమ్మఘట్ట: మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన హనుమంతరాయుడు, ఈరమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థిరాస్తులేమీ లేకపోవడంతో బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. అక్కడే పిల్లలను చదివించుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో రాయదుర్గం మండలం వేపరాల గ్రామంలో ఉన్న అమ్మమ్మ గంగమ్మ ఇంటికి వచ్చిన కుమారుడు శరత్‌ (16)... శనివారం స్నేహితులతో కలసి సరదాగా వేదవతి హగరిలోని ఓ గుంతలో ఉన్న నీటిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. ఆ సమయంలో స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టి వెలికి తీసేలోపు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి గ్రామానికి చెందిన హరిజన వెంకటేశులు అనంతపురానికి మకాం మార్చి ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అనంతపురంలోనే ఆయన కుమారుడు విజయ్‌కుమార్‌ ఏడో తరగతి చదువుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో అపార్ట్‌మెంటులోని తన స్నేహితులతో కలసి స్వగ్రామం జీడిపల్లికి విజయ్‌కుమార్‌ వచ్చాడు. శనివారం రిజర్వాయర్‌ కాలువ సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విజయ్‌కుమార్‌ నీటిలో పడిపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు వెంటనే కాలువ వద్దకు చేరుకుని గాలించి వెలికి తీసేలోపు విజయకుమార్‌ మృతి చెందాడు. ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శివ తెలిపారు.

శరత్‌ (ఫైల్‌), మృతుడు విజయ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement