సాక్షిప్రతినిధి, అనంతపురం: అమాయకులను లక్ష్యంగా చేసుకుని అమ్మాయిలను ఎరగా వేసి.. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి దూసుకొచ్చి ఒళ్లు హూనమయ్యేలా చితకబాది.. నగ్న ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి.. బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్న హనీట్రాప్ ముఠాపై పోలీసు శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు రంగమ్మ నాయుడు, రాజేష్ నాయుడు, నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నడిచిన హనీ ట్రాప్ దందాపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఠా సభ్యుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్‌డేటా ఆధారంగా ఆడియో రికార్డులు తెప్పించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులపై ఆడియో రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.
పోలీసు ప్రతిష్ట పెంచే దిశగా చర్యలు
‘అనంత’ హనీట్రాప్ వ్యవహారాన్ని ఛేదించడంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో పోలీసు అధికారుల పాత్ర ఉండటం ఆయన్ను బాధించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ముఠాలో ఉన్నవారు, అందులో భాగస్వాములుగా ఉన్నవారు ఎవ్వరినీ వదలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్, డీఐజీ షీమోషీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖకు తీరని మచ్చను మిగిల్చిన ఈ వ్యవహారంలోని పోలీసులందరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా రాప్తాడు సీఐ శ్రీహర్షను విధుల నుంచి పూర్తిగా తొలగించేలా సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌పై కూడా సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలిసింది. వీరితో పాటు మరికొంతమంది పోలీసుల పాత్రపై ఆరా తీయడంతో పాటు ఆధారాలు సేకరిస్తున్నారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా పోయిన పోలీసు ప్రతిష్టను పునరుద్ధరించాలనే భావనలో ఎస్పీ, డీఐజీ ఉన్నట్లు తెలు స్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ సాగుతోంది.
నలుగురు సీఐల పాత్రపై ఆరా
హనీ ట్రాప్ ముఠా బాధితులతో రెండు, మూడేళ్ల కిందటి తేదీలతో ప్రామిసరీనోట్లు రాయించుకున్న తర్వాత వాటిని సీఐల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసే పని చేశారు. ఈ వ్యవహారంలో అనంతపురంతో పాటు ఇతర ప్రాంతాల్లోని బాధితులు ఉన్నారు. వీరితో డబ్బులు వసూలు చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లోని సర్కిళ్లలో పని చేసే సీఐలు, ఎస్‌ఐల సహకారం తీసుకున్నారు. అయితే ఆ సీఐలు కూడా హనీ ట్రాప్ వ్యవహారం తెలిసి సహకరించారా? తెలీకుండా బకాయిలు మాత్రమే వసూలు చేశారా? బకాయిలు వసూలు చేయమని ఏ టీడీపీ నేత సిఫార్సు చేశారు? అనే దిశగా కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పురోహితులనూ వదలని గ్యాంగ్
హనీట్రాప్ బాధితుల్లో ఉద్యోగులు, వ్యాపారులు, రియల్టర్లతో పాటు పురోహితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత బాధితులు నేరుగా ఎస్పీని కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. ముఠా సభ్యుల నుంచి బాండ్లను సేకరించిన ఎస్పీ.. వాటిని చించేసినట్లు తెలుస్తోంది. అలాగే వసూలు చేసిన డబ్బుల రికవరీ దిశగా కూడా ఎస్పీ ఆలోచిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఎస్పీకి బాధితులు వాయిస్ మెసేజ్, ఫోన్లు, వాట్సాప్ ద్వారా ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు బాధితుల వేదనను విన్న ఎస్పీ తీవ్రంగా చలించినట్లు తెలుస్తోంది.
ఓ ప్రజాప్రతినిధి వీడియోపై సర్వత్రా చర్చ!
హనీట్రాప్ వ్యవహారంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని జిల్లా పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ డీజీకి, డీజీపీకి పంపారని తెలుస్తోంది. అయితే ఇది పోలీసు వర్గాలతో పాటు టీడీపీ నేతలతో చర్చిస్తున్న అంశమే. ఇది వాస్తవమా కాదా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
హనీట్రాప్‌కు రాజకీయ రంగు
హనీట్రాప్ వ్యవహారంలో అరెస్టయిన లేడీ డాన్ రంగమ్మనాయుడు బీజేపీ నుంచి టీడీపీలో చేరారు. రాజేశ్‌నాయుడు టీడీపీలో కొనసాగుతున్నారు. అలాగే రుద్రంపేట మాజీ ఉపసర్పంచ్ నరేంద్రరెడ్డి వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచినా, 2024కు ముందే టీడీపీలో చేరారు. ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్‌కు అనుకూలంగా పని చేశారు. అలాగే అనంత వెంకటరామిరెడ్డిని ఓడించేందుకు పనిచేస్తానని ఎల్లో మీడియా వేదికగా చెప్పారు. ఇలాంటి వ్యక్తిని తిరిగి వైఎస్సార్‌సీపీ నేతగా ప్రచారం చేసే ప్రయత్నం టీడీపీ నేతలు, అనుకూల మీడియా చేశాయి. అయితే వాస్తవం ‘అనంత’ ప్రజానీకానికి తెలియడంతో టీడీపీ ఎత్తులు పారలేదు.
మరో ఆరుగురి పోలీసులపై చర్యలు
హనీ ట్రాప్ ముఠాతో సంబంధాలు ఉన్న పోలీసులపై చర్యలకు ఎస్పీ జగదీష్ ఉపక్రమించారు. ఇందులో భాగంగా అనంతపురం రూరల్, ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్లలో పని చేస్తున్న ఆరుగురు సిబ్బందిని వీఆర్‌కు పంపుతూ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వీఆర్‌కు వెళ్లిన వారిలో అనంతపురం రూరల్ ఏఎస్‌ఐ నాగరాజు, హెడ్‌కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు జయరాంనాయక్, దేవేంద్ర, మురళి ఉన్నారు. అలాగే ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవ్లానాయక్ ఉన్నారు.
ముఠాలోని టీడీపీ నేతల కాల్ రికార్డులు పరిశీలిస్తున్న పోలీసులు
ముఠాలో మరికొంతమంది పోలీసులు, రాజకీయ నేతలు ఉన్నట్లు గుర్తింపు
బాధితుల్లో పురోహితులు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయనేతలు కూడా..
ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్‌తో లోతుగా విచారణ చేయిస్తున్న ఎస్పీ జగదీష్
వీఆర్‌కు మరో ఆరుగురు పోలీసులు


