విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

అనంతపురం అర్బన్‌: విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ ఆనంద్‌ ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఐసీడీఎస్‌ పనితీరుపై కలెక్టర్‌ శుక్రవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీకి సిఫారసు చేసిన పిల్లలు తప్పనిసరిగా అక్కడే ఉండేలా చూడాల్సిన బాధ్యత సీడీపీఓ, సూపర్‌వైజర్లదేనని అన్నారు. పోషణ్‌ ట్రాకర్‌, గ్రోత్‌ మానిటరింగ్‌కు సంబంధించి కచ్చితమైన డేటా నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్లు, సీడీపీఓలు సందర్శించడంతో పాటు పిల్లల ఎత్తు, బరువు కొలచాలన్నారు. ఆ రిపోర్టును ఆదే రోజు సమర్పించాలని ఆదేశించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, పిల్లల బరువు విషయంలో జాగ్రత్తలు పాటించనట్లు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీహెచ్‌ఆర్‌ పంపిణీలో జిల్లా 8వ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో మొదటిస్థానానికి చేరుకునేలా పనిచేయాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులను పౌరసరఫరాల శాఖ సరఫరా చేయడంలో ఆలస్యం చేస్తే విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలన్నారు. టీనేజీ ప్రెగ్నెన్సీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధార్‌ కార్డులేని పిలల్లను, డ్రాపౌట్‌ విద్యార్థులను తిరిగి పాఠశాల్లలో చేర్పించాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంమైన తరువాత వయసు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల ఉన్న విద్యార్థినులకు బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ శశికళ, జిల్లా సరఫరాల సంస్థ మేనేజర్‌ రమేష్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులురెడ్డి, సీడీపీఓలు శ్రీదేవి, లలితమ్మ, షాజిదాబేగం, ఎల్లమ్మ, ఉమా, భారతి, సూపర్‌వైజర్లు, పాల్గొన్నారు.

ప్రజలు నేరుగా ఫిర్యాదులు సమర్పించాలి

అనంతపురం అర్బన్‌: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు మధ్యవర్తుల ద్వారా కాకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదులు సమర్పించాలని కలెక్టర్‌ ఆనంద్‌ స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులు ఆర్‌టీఐ కార్యకర్తలు, స్థానిక దళారుల వంటి మధ్యవర్తుల ద్వారా నమోదవుతున్నాయన్నారు. చాలా సందర్భాల్లో సంబంధిత వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు నేరుగా నమోదు చేసుకోవడానికి బదులుగా అర్జీదారుల వివరాలను ఉపయోగించి ఇతరుల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో ఫిర్యాదుల పరిష్కార సమయంలో పౌరులకు, పరిష్కరించే అధికారులకు, శాఖాధిపతులకు అనవసరమైన సమస్యలకు, అసౌకర్యానికి దారితీస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement