అనంతపురం: ‘జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి ..అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ముఖ్య అనుచరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ దగ్గుపాటి తరఫునే పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా ఉన్నాయి. అయినా అతను మావాడు కాదని టీడీపీ నేతలు అనడం, ఎల్లోమీడియా కూడా వైఎస్సార్‌సీపీకి ఆపాదించి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు’ అని అనంతపురం నగర మాజీ మేయర్ వసీం సలీం, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వారు అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నరేంద్రరెడ్డిని నాలుగేళ్ల క్రితమే వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంచినట్లు మాజీ మేయర్ వసీం తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ స్వయంగా నరేంద్రరెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని కలిశారన్నారు. అలాగే అతను దగ్గుపాటి తరఫున ఎన్నికల్లో పనిచేశాడని, గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లి మరీ అభినందించాడని తెలిపారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చినందుకు 101 టెంకాయలు కొట్టి సంబరాలు చేసుకున్నాడన్నారు. అలాంటి వ్యక్తి హనీ ట్రాప్ కేసులో దొరకగానే ఎల్లోమీడియా తప్పుడు ప్రచారానికి తెర లేపిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో నగరంలో అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. భూకబ్జాలు, అక్రమాలు, బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో హనీట్రాప్‌లు జరిగేవని, ఇప్పుడు టీడీపీ నేతల అండ, పోలీసుల నిర్లక్ష్యంతో అనంతపురంలోనూ జరుగుతున్నాయన్నారు. నగర అధ్యక్షుడు సోమ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు జిల్లాలో రైతు ఆత్మహత్యలు చూశామని, ఇప్పుడు హనీట్రాప్‌ల కారణంగా బాధితులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తున్నామని అన్నారు. గత ఎన్నికల సమయంలో రుద్రంపేట నరేంద్రరెడ్డి వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటూ ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీలో సైతం కథనాలు వచ్చాయన్నారు. మళ్లీ ఇప్పుడు అతను వైఎస్సార్‌సీపీ అంటూ ఎల్లోమీడియా చిత్రీకరించడం దారుణమన్నారు. మంచి జరిగితే టీడీపీకి.. చెడు అయితే వైఎస్సార్‌సీపీకి ఆపాదించడం ద్వారా మీడియా విలువలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. నగరంలో గంజాయి, బెల్ట్ షాపులు మితిమీరిపోయాయని, విచ్చలవిడిగా పర్మిట్ రూమ్‌లు పెట్టి నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.
రుద్రంపేట నరేంద్రరెడ్డి టీడీపీ వ్యక్తే
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటికి ప్రధాన అనుచరుడు
హనీట్రాప్ కేసులో దొరకగానే మీవాడు కాదంటారా?
టీడీపీ, ఎల్లోమీడియాపై మాజీ మేయర్ వసీం, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి ధ్వజం


