● మూడు నియోజకవర్గాలో దాహం కేకలు
కూడేరు: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల ఏకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఏర్పాటైన నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ పథకం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర నియోజక వర్గాల్లోని సుమారు 1,050 గ్రామాలకు తాగునీటిని సరఫరా అవుతోంది. ఈ నెల 19న తాగునీటిని సరఫరా చేసే మూడు పంపింగ్ పైపులు పని చేయకుండా మొరాయించాయి. ఇందులో ఒక పంపింగ్ పైపు పనిచేసినా కూడా నీటి సరఫరా సాఫీగానే సాగుతుంది. అయితే ఒక దాని తర్వాత మరొకటి అలా మూడు పంపింగ్ పైపులూ పనిచేయకుండా పోయాయి. కాంట్రాక్టర్, అధికారులు పంపింగ్ పైపుల పని తీరును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. మరమ్మతుల కోసం రెండు రోజుల క్రితం పంపింగ్ పైపులను తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం వరకు పైపులను అమర్చలేదు. ఆరు రోజులుగా కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలోని గ్రామాలకు నీటిసరఫరా ఆగిపోయింది. అసలే వేసవి. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గానికి మాత్రం ప్రత్యామ్నాయ మార్గం గుండా నీటిసరఫరా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పంపింగ్ పైపులకు మరమ్మతులు చేయించి తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


