‘అనంత’ వేదికగా ఫుట్‌బాల్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

‘అనంత’ వేదికగా ఫుట్‌బాల్‌ టోర్నీ

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

అనంతపురం అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ఆర్‌డీటీ స్టేడియం వేదికగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి శాప్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌–2026 నిర్వహించున్నారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ ఆదేశించారు. టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీకాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో జేసీ సమీక్షించారు. అండర్‌–15, అండర్‌–19 బాలబాలికల విభాగంలో మూడు రోజుల పాటు టోర్నీ సాగుతుందన్నారు. ప్రతి జిల్లా నుంచి దాదాపు 72 మంది చొప్పున 28 జిల్లాల ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. బాలికలకు విన్సెంట్‌ డిపాల్‌, ఆర్‌డీటీలో వసతి ఉంటుందని, బాలురకు కలెక్టరేట్‌ సమీపంలోని బుడ్డప్పనగర్‌లో ఉన్న రాజేంద్ర మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. క్రీడా ప్రాంతం, వసతి ప్రదేశాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మంజుల, వైఎస్సార్‌ కడప స్పోర్ట్స్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌, ప్రత్యేక అధికారి జగన్నాథరెడ్డి, ఆన్‌సెట్‌ అధికారి శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement