అనంతపురం: బీసీలకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. బీసీల హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 26న అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో నిర్వహించనున్న ‘బీసీ గళం’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ‘బీసీ గళం’ పోస్టర్లను గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. భగీరథ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో బీసీల అభివృద్ధికి తీసుకున్న చర్యలను నేడు కొనసాగించడం లేదని దుయ్యబట్టారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు, సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడం సిగ్గుచేటన్నారు.
అడుగడుగునా దగా
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం బీసీల కోసం సంక్షేమ పథకాల అమలులో వివక్ష చూపుతోందని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సభలో బీసీల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో బీసీలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం బీసీలను అడుగడు గునా దగా చేస్తోందన్నారు. ‘బీసీ గళం’ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, హరిత, సాకే చంద్రలేఖ, భారతి, హజరబి, కమర్ తాజ్, పార్వతి, రాధా యాదవ్, ప్రియాంక, జిల్లా ప్రధాన కార్యదర్శులు పూజారి రాజశేఖర్ యాదవ్, గౌని నాగన్న, నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, కాగజ్‌ఘర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారు
చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కాక అటకెక్కించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ అని నిరూపించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధ్వజం
బీసీల హక్కుల సాధనకు
‘అనంత’లో 26న ‘బీసీ గళం’ సభ
విజయవంతం చేయండి: పార్టీ
జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు


