తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

కూడేరు: ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దేవానంద, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ తిరుపతి రెడ్డి, ఉద్యాన పరిశోధన స్థానం సైంటిస్ట్‌ రమేష్‌ అన్నారు. కూడేరు మండల పరిధిలోని మరుట్లలో గురువారం వారు పర్యటించారు. చీనీ, మామిడి, దానిమ్మ పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా చీనీలో వేరుకుళ్లు, గమ్మోసిస్‌ తెగులు గుర్తించారు. గమ్మోసిస్‌తో చీనీ చెట్టు కాండం ప్రాంతంలో బెరడు బంక్‌ మాదిరి కారి నిదానంగా మొత్తం ఎండిపోతుందన్నారు. వేరుకుళ్లు తెగులుతో పోషక పదార్థాలు, నీరు చెట్టుకు అందకుండా పోయి ఎండిపోతాయని, తెగుళ్లు సోకిన వెంటనే కాండం, వేర్లకు తగలకుండా కలుపు మందు పిచికారీ చేయాలని సూచించారు. వారి వెంట నియోజకవర్గ హెచ్‌ఓ యామిని ఉన్నారు.

ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశ

పరీక్షలు నిర్వహించరాదు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత, నిర్భంద విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ)–2009 సెక్షన్‌ 13 ప్రకారం 1–8 తరగతుల ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు, స్క్రీనింగ్‌, టాలెంట్‌ టెస్ట్‌లు, స్కాలర్‌షిప్‌ టెస్ట్‌లు నిర్వహించరాదన్నారు. స్టేట్‌ సిలబస్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇలా ఏ సిలబస్‌ అనుసరిస్తున్న పాఠశాలలకైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి పరీక్షలు నిర్వహించే పాఠశాలలకు సెక్షన్‌ 13(2)(బీ) ప్రకారం మొదటి ఉల్లంఘనకు రూ. 25 వేల జరిమానా, తదుపరి ప్రతి ఉల్లంఘనకు రూ. 50 వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిబంధనల తీవ్రతను బట్టి పాఠశాల గుర్తింపు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. ఉప విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

గుంతకల్లు డివిజన్‌ను

అభివృద్ధి బాటలో నడుపుదాం

గుంతకల్లు: గుంతకల్లు డివిజన్‌ను అభివృద్ధి బాటలో నడుపుదామని దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి విడిపోయిన గుంతకల్లు డివిజన్‌లో తొలిసారిగా గురువారం ఆయన పర్యటించారు. ప్రత్యేక రైలులో గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయనకు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయంలోని మీటింగ్‌ చాంబర్‌లో డివిజన్‌ స్థాయి అధికారులతో సందీప్‌ మాథుర్‌ సమావేశయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో గుంతకల్లు డివిజన్‌ విలీనమవుతున్న తరుణంలో డివిజన్‌ భౌగోళిక సరిహద్దులతోపాటు ఎంత మేర డివిజన్‌ కుదింపులకు గురవుతుందనే అంశాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని రాయచూర్‌ సెక్షన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలని రైల్వేబోర్డు నిర్ణయించినట్లు తెలిసిందన్నారు. జూన్‌లో డివిజన్‌ భౌగోళిక స్వరూపంతోపాటు రూట్‌ మ్యాప్‌ నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు శ్రమించి డివిజన్‌ను అన్ని విభాగాల్లో ముందంజలో నిలపాలని పిలుపునిచ్చారు. అనంతరం కంట్రోల్‌ రూం కార్యాలయాన్ని, గుంతకల్లు –డోన్‌ రైలు మార్గాన్ని జీఎం తనిఖీ చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ బాలాజీ కిరణ్‌ పాల్గొన్నారు.

మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలు www.apms. apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఆయా మోడల్‌ స్కూళ్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement