ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆరాధనోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాల నేపథ్యంలో సాయికుల్వంత్ సభా మందిరాన్ని, సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకలకు భక్తులు భారీగా తరలిరానుండగా...సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. ఆరాధనోత్సవాల్లో భాగంగా నిర్వహించే నారాయణ సేవకు హిల్‌వ్యూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సత్యసాయి ఆరాధనోత్సవాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో వేద పఠనంతో ప్రారంభమవుతాయి. 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు పంచ రత్న కీర్తనలు ఆలపిస్తారు. 9 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఎస్‌ఎస్ నాగానంద ప్రారంభోపన్యాసం చేస్తారు. సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండ్య వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి పూర్వ ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. భజన, మంగళ హారతితో ఉదయం వేడుకలు ముగుస్తాయి.
నారాయణసేవ..
ఆరాధనోత్సవాల్లో భాగంగా భక్తులకు నారాయణ సేవ (అన్నప్రసాద వితరణ) నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంతి నిలయంలో వేడుకలు ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణతో పాటు నూతన వస్త్రాలను బహూకరిస్తారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననుండగా.. హిల్‌వ్యూ స్టేడియంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు.


