‘నక్ష’పై ప్రత్యేక దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

‘నక్ష’పై ప్రత్యేక దృష్టి సారించాలి

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

అనంతపురం అర్బన్‌: ‘‘కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లోని భూముల సర్వే కోసం నక్ష ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ఈ ప్రాజెక్టు అమలుకు 10 పుర, నగరపాలక సంస్థలను ఎంపిక చేసింది. అనంతపురం కూడా పైలెట్‌ ప్రాజ్టెక్టు కింద ఎంపిక కానున్న నేపథ్యంలో ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అన్నారు. కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు అమలుతో ప్రభుత్వ, స్థానిక సంస్థల ఖాళీ స్థలాలు, భూముల లభ్యతపై స్పష్టత వస్తుందన్నారు. ఈ క్రమంలో వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. అందుబాటులోని ఖాళీ భూముల్లో ప్రజలకు గృహవసతి కల్పించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో నక్ష ప్రాజెక్టు సర్వేను వేగవంతం చేయడంతో పాటు డిజిటల్‌ మ్యాపింగ్‌ పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అహుడా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ ఎస్‌ఈ రాజశేఖర్‌, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీలక్ష్మి, సర్వే ఏడీ విజయసారథి, టెలికాం జేటీఓ రామకృష్ణ, కార్పొరేషన్‌ ఇన్‌చార్జ్‌ టీపీఓ ఓంకార్‌ పాల్గొన్నారు.

‘పీఎం సూర్యఘర్‌’ను

సద్వినియోగం చేసుకోండి

పామిడి: పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. గురువారం ఆయన పామిడిలో పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఏర్పాటు చేసిన ఉచిత సోలార్‌ ప్యానెల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాలో 17 వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించారన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి మండలానికి కేటాయించిన డ్రోన్‌ను అన్నదాతలు వినియోగించుకోవాలన్నారు. రాబోయే ఏడాదిలో పీఎం జన ధన్‌ కృషి యోజన పథకం కింద రూ. 80 కోట్లతో వ్యవసాయాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామన్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ షర్మిల, ఏఈ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement